సైకిల్‌, హస్తం కలుస్తున్నాయా?

ప్రియాంకా, డింపుల్‌ ఫొటో పక్కపక్కనే..


అలహాబాద్‌: సమాజ్‌ వాది పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కలిసి పనిచేయనున్నాయా? తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య దాదాపు పొత్తు కుదిరినట్లేనా? అంటే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అలహాబాద్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి హసీబ్‌ అహ్మద్‌ ఏర్పాటుచేసిన పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఫొటోలు చేర్చారు. అతడి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో కూడా ఈ ఫ్లెక్సీల ఫొటోలను పోస్ట్ చేశాడు.ఈ పోస్టర్లలో 'ఉత్తరప్రదేశ్‌లోకి మతశక్తులు ప్రవేశాన్ని అడ్డుకునేందుకు మేమంతా ఒక్కటయ్యాం. ప్రియాంకా గాంధీ, డింపుల్‌ యాదవ్‌కు సుస్వాగతం' అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాశారు. ప్రియాంక, డింపుల్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రమోద్‌ తివారీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌  యాదవ్‌ ఫొటోలు కూడా చేర్చారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన హసీబ్‌ వివరణ ఇస్తూ..'ఈ పోస్టర్‌ ద్వారా కమ్యునల్‌ శక్తులను అడ్డుకునేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని చెప్పాలనుకున్నాను. పునర్‌వైభవాన్ని తెచ్చేందుకు అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఇది చాలా మంచి అవకాశం. కాంగ్రెస్‌ నాయకత్వం ఈ విషయంలో తప్పకుండా ఆలోచించాలి. ఒక వేళ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే వెళితే మా పార్టీకి మెజారిటీ వస్తుంది. లేదా రెండు పార్టీలు కలిసి పనిచేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు చేయొచ్చు' అని చెప్పాడు. కాగా, దీనిపై యూపీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ ముకుంద్‌ తివారీ స్పందిస్తూ 'కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేం పాటిస్తాం. పార్టీ విజయం కోసం పనిచేస్తాం' అని అన్నారు.మరోపక్క, వీరి కలయికపై బీజేపీ సీనియర్‌ నేత  ఒకరు స్పందిస్తూ ఒంటరిగా పోటీ చేస్తే బతకదనే విషయం కాంగ్రెస్‌ పార్టీకి ముందే తెలుసుకాబట్టే సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదేమైనా ఈ రెండు పార్టీలకు ఈసారి ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని, బీజేపీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Back to Top