విదేశీ భూభాగంపై ఆశలేదు

PM Modi says India not eying anyone's territory - Sakshi

ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సులో ప్రధాని మోదీ

దక్షిణాసియాలో చైనా జోక్యాన్ని పరోక్షంగా తప్పుపట్టిన ప్రధాని

న్యూఢిల్లీ: ఏ దేశ భూభాగంపైగానీ, వనరులపైన గానీ భారత్‌కు కన్ను లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దక్షిణాసియాలో ఆధిపత్యానికి ఇటీవల చైనా చేస్తున్న ప్రయత్నాల్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఇతర దేశాలకు అభివృద్ధి సాయం చేసే విషయంలో మానవతా దృక్పథమే తప్ప.. భారత్‌ది ఇచ్చి పుచ్చుకునే ధోరణి కాదని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారత పార్లమెంటేరియన్లతో నిర్వహించిన ‘పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (పీఐఓ)’ తొలి సదస్సులో మంగళవారం ప్రధాని ప్రసంగించారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, అభివృద్ధికి సహాయకారిగా ఉండాలని వారిని కోరారు. ప్రపంచంలో భారత్‌ ఎప్పుడూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని, ఉగ్రవాదం, తీవ్రవాదాల్ని తిప్పికొట్టగల శక్తి మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతానికి ఉందన్నారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మహాత్మాగాంధీ వచ్చినరోజుకు సంబంధించిన 102వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహించారు. 24 దేశాలకు చెందిన 134 మంది ప్రవాస భారతీయ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

‘ప్రపంచంలో భారత్‌ ఎప్పుడూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంది. ఇతర దేశాల విషయంలో లాభ నష్టాల దృష్టితో చూడటం భారత్‌ విధానం కాదు. మానవతా విలువల కోణంలోనే వ్యవహరిస్తున్నాం. ఇతర దేశాల అవసరాలు, ప్రాధామ్యాల మేరకు అభివృద్ధి కోసం సాయం చేస్తున్నాం తప్ప.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కాదు. మన దృష్టి ఎప్పుడూ సామర్థ్యాన్ని పెంచుకోవడం, వనరుల అభివృద్ధిపైనే’ అని ప్రవాస చట్టసభ్యుల్ని ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో భారత్‌ పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌ను తన వైపునకు తిప్పుకు నేందుకు చైనా భారీగా సాయం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గో రక్షకుల దాడులు రాచపుండు లాంటివి!
భారత సంతతికి చెందిన టాంజానియా చట్టసభ సభ్యుడు సలీం టర్కీ మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వాన్ని చూసి టాంజానియాలో మేం గర్విస్తున్నాం. కానీ ఇక్కడ గోరక్షకుల పేరుతో కొందరు వ్యక్తులు ఇతరులపై దాడులు చేస్తున్నారు. వారి చావుకు కారణమవుతున్నారు. ఇది భారత్‌కు మంచిది కాదు. శరీరంపై కేన్సర్‌ పుండు ఎలా బాధిస్తుందో, ఈ గోరక్షకుల దాడులు కూడా అలాంటివే’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top