ఎప్పుడేం జరుగుతుందో

People in the Valley of Kashmir are terrified of going on - Sakshi

శ్రీనగర్‌: భారత వైమానిక దళం పాక్‌లో సర్జికల్‌ దాడులు జరిపిన తర్వాత జమ్మూ, కశ్మీర్‌ లోయలోని ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ఈ అంశం గురించే చర్చించుకుంటున్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందని ఆశిస్తున్నా. ఇంకా కొనసాగితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. దీనివల్ల నియంత్రణ రేఖకు ఇరు వైపులా ఉన్న ప్రజలు తీవ్రంగా బాధపడతారు’అని భారత్, పాక్‌ మధ్య జరిగిన అన్ని యుద్ధాలను చూసిన 80 ఏళ్ల అబ్దుల్‌ ఘనీ దార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న బుకింగ్స్‌ను చాలా హోటళ్లు రద్దు చేస్తున్నాయని యజమానులు చెబుతున్నారు.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పూంచ్, రజౌరీ గ్రామాల ప్రజలను వెంటనే బంకర్లలో తలదాచుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించినట్లు పలువురు స్థానికులు చెప్పారు. వేర్పాటువాదులు, వారి మద్దతుదారుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. కాగా, పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలు ఆందోళన చెందొద్దని, ఆ ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ భరోసానిచ్చారు. ఫిరోజ్‌పూర్, తర్న్‌ తరన్, అమృత్‌సర్, గురుదాస్‌ఖఫూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా జిల్లాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అలాగే పశ్చిమ నావికాదళం, ముంబై పోలీసులను అప్రమత్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top