కరోనాకు 'అడ్డు'కట్ట!

Odisha Tribal People Using Leaf Masks - Sakshi

ఒడిశా, జయపురం: ఒక్కసారిగా ప్రపంచాన్ని తన రక్కసి కోరల్లో చుట్టుముట్టిన కరోనా భయం.. దేశంలోనూ వెంటాడుతుంది. ఇప్పటికే వందలాది పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొంతమంది వ్యాధి తీవ్రతరం కావడంతో ప్రాణాలు వీడారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు వస్తే మాస్క్‌లు ధరించాలని సూచించింది. అయితే కొరాపుట్‌ జిల్లాలోని ఆదివాసీ లకు కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకునేందుకు  పట్టణాల్లో ప్రజలు ముఖానికి మాస్క్‌లు కట్టుకుంటున్న విషయం తెలిసిందే.

దీనిని గమనించిన కొంతమంది ఆదివాసీలు.. మాస్క్‌లు ధరించాలని భావించారు. అయితే... ఆర్థిక పరిస్థితి అంతంమాత్రం కావడం, అందరికీ అందుబాటులో లేకపోవడంతో తమ బుర్రకు పదును పెట్టారు. సృజనాత్మకంగా తమకు విస్తారంగా అందుబాటులో ఉన్న ఆకుటను వినియోగించారు. డొనలుగా తయారు చేసి, భోజనాలకు వినియోగించే పెద్ద ఆకులపై దృష్టి సారించారు. వాటినే మాస్క్‌ లుగా తయారు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోకి కూలి పనుల నిమిత్తం వచ్చే వారంతా వీటినే ముఖానికి ధరించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివిధ ఔషధ గుణాలు ఉండే.. ఆకుల మాస్క్‌లు కరోనా మహమ్మారిని కట్టడి చేయడం తోపాటు డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చని ఇలా చెప్పకనే చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top