శశికళ పక్క సెల్‌లో ఆరుహత్యల హంతకురాలు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవిని ఆశించి అక్రమాస్తుల కేసు కారణంగా భంగపడి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలు విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆమె ఉంటున్న సెల్‌ పక్కనే ఓ హంతకురాలు ఉంటోంది. ఆమె పలుమార్లు శశికళతో మాట్లాడేందుకు తెగ ప్రయత్నించిందంట. అయినప్పటికీ కనీసం ఒక్క మాట కూడా శశికళ మాట్లాడలేదని బెంగళూరు మిర్రర్‌ చెప్పింది. అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరిప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమె అక్కడే ఉండి తన విశ్వసనీయుడు పళనిస్వామి సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు.అదే, సమయంలో ఆమె పక్క గదిలో ఉంటున్న సియానిడే మల్లికా అనే మహిళా హంతకురాలు శశికళతో మాట్లాడే ప్రయత్నం చేసిందట. ఈమెపై ఆరు హత్యా కేసులు ఉన్నాయి. ఆలయాల వద్దకు వచ్చిన వారి బంగారం కోసం ఆరుగురిపై విష ప్రయోగానికి దిగిన కేసులో ఉరిశిక్ష పడగా ఇటీవలె జీవితకారాగార శిక్షగా మారింది. ప్రస్తుతం శశికళ గది పక్క గదిలోనే మల్లిక ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శశికళతోనే మాట్లాడేందుకు ప్రయత్నించగా తొలిరోజు ఆమె అస్సలు స్పందించలేదంట. గురువారం మాత్రం ఆమె మరో జైలు సహచరిని చూసి నవ్వారని బెంగళూరు మిర్రర్‌ పేర్కొంది.

Back to Top