తడవకుండా స్నానం చేసిన మోదీ!

Narendra Modi Took A Bath Without Getting Wet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఐదేళ్ల పదవీ కాలంలో మొట్టమొదటి సారిగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడబోతున్నారంటూ శుక్రవారం సాయంత్రం అనూహ్య ప్రకటన వెలువడడంతో సోషల్‌ మీడియా అత్యుత్సాహంతో ఎదురు చూసింది. టీవీ ఛానళ్లు తమ షెడ్యూల్‌ కార్యక్రమాలను పక్కన పడేసి మోదీ సమావేశాన్ని ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంతవరకు తాను ఎంపిక చేసుకున్న ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చిన నరేంద్ర మోదీ, ప్రధాన మీడియాను ఎదుర్కొనేందుకు జంకుతున్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో మీడియా ముఖంగా మాట్లాడేందుకు ఆయన ముందుకు వచ్చారు.

ఎన్నో ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం రాబట్టాలని మీడియా మిత్రులు ఆశించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, తాము సాగించిన ఎన్నికల ప్రచారం తీరు గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రతి ప్రశ్నకు ప్రధాన మంత్రియే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆయన పక్కనే కూర్చున్న పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాయే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దీంతో ట్విటర్‌లో ట్వీట్లీ మీద ట్వీట్లు హల్‌చల్‌ చేశాయి.

‘అచ్చే దిన్‌కు చక్కటి నిర్వచణం మోదీ విలేకరుల సమావేశం. ఆయన ఎన్నో ఆశలు పెంచారు. భారతీయులను నిరీక్షింపచేశారు. వారికి ఏం చేయలేక పోయారు.......ఆయన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా 17 నిమిషాలు విలేకరుల సమావేశంలో కూర్చున్నారు. ఆయనకు లిఖిత పూర్వకంగా రాసిస్తే తప్పా, సమాధానాలు ఇవ్వరనుకుంటా!....అమిషా వికేలకరుల సమావేశానికి మోదీ హాజరు..... ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఏం చిత్రం!...’ అంటూ ట్వీట్లు వెలువడగా, ‘నరేంద్ర మోదీ ఒళ్లు తడువకుండా స్నానం చేశారు’ అంటూ మరో ఆకర్షణీయమైన ట్వీట్‌ వెలువడింది. 2017లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్ర మోదీ ఇలాంటి ట్వీటే చేశారు.

మన్మోహన్‌ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల గురించి మోదీ ప్రస్తావిస్తూ ‘ఒళ్లు తడవకుండా రెయిన్‌ కోట్‌ వేసుకొని స్నానం చేయడం మన్మోహన్‌కు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.‘మోదీ విలేకరుల సమావేశంలో ప్రశ్నలన్నింటికీ ఫీల్డింగ్‌ చేసిన అమిత్‌ షా.....జర్నలిస్టులుగా హాజరైన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపడం మరచిపోకుసుమా అమిత్‌ షా.......అంటూ ఎవరికి వారు తమదైన శైలిలో స్పందించగా, ‘మోదీ జీ అభినందనలు. మీ విలేకరుల సమావేశం అద్భుతంగా ఉంది. సగం యుద్ధం చేశారు. వచ్చేసారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం అమిత్‌ షా మీకివ్వొచ్చు. బాగుంది’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top