అరాచకవాది అడవులకు వెళ్లాలి : మోదీ

అరాచకవాది అడవులకు వెళ్లాలి : మోదీ - Sakshi


* ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ మండిపాటు

* తన రాజీనామాతో ఏడాది కాలాన్ని వృథా చేశారు

* అబద్ధాలు, డ్రామాల్లో ఆరితేరారు

* అలాంటి వ్యక్తికి ఢిల్లీ పీఠం అప్పగించొద్దు.. వచ్చే ఎన్నికల్లో శిక్షించండి

* బీజేపీకి పట్టం కట్టండి.. అవినీతి రహిత పాలన అందిస్తాం

* 2022 నాటికి మురికివాడలు లేని నగరంగా మారుస్తాం


 

 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆయనను ‘అరాచకవాది’గా అభివర్ణిస్తూ... ఢిల్లీ సీఎం పీఠాన్ని అలాంటి వ్యక్తికి అప్పగించొద్దని ప్రజలకు సూచించారు. తన రాజీనామాతో ఏడాది సమయాన్ని వృథా చేసినందుకు కేజ్రీవాల్‌ను రానున్న ఎన్నికల్లో శిక్షించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ రామ్‌లీలా మైదాన్‌లో అభినందన్ ర్యాలీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానితోపాటు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

 

 ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ఎక్కడా కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై నిప్పులు చెరిగారు. ఏడాది క్రితం తనను తాను ‘అరాచకవాది’గా అభివర్ణించుకున్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ‘‘అరాచకవాదిగా ఉండాలనుకుంటే అడవుల్లోకి వెళ్లి నక్సల్స్‌లో చేరాలి. అలాంటి అరాచకవాది ఢిల్లీకి అక్కర్లేదు. అభివృద్ధి, అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన కావాలంటే బీజేపీ చేతికి అధికారం ఇవ్వండి. సరికొత్త ఢిల్లీని నిర్మించుకుందాం’’ అని అన్నారు. అబద్ధాలు, డ్రామాలు, నిరసన కార్యక్రమాల్లో కేజ్రీవాల్ ఆరితేరారని, అలాంటివారికి అదే పాత్ర ఇవ్వాలని, సుపరిపాలనకు మారుపేరైన బీజేపీకి అధికారం కట్టబెట్టాలని పేర్కొన్నారు. ‘‘ఒక డ్రైవర్‌కు మనం వంట చేసే పని అప్పగిస్తామా? డ్రైవర్ ఆయన పనినే చక్కగా చేస్తాడు. ఎవరి చేసే పని వారికే అప్పగించాలి. ధర్నాలు, నిరసనలతో రోడ్లను దిగ్బంధించేవారికి(ఆప్‌ని ఉద్దేశించి) అదే పనిని అప్పగించండి. మంచి పాలన అందించే సామర్థ్యమున్న బీజేపీకి పగ్గాలు అప్పగించండి’’ అని సూచించారు. తాము అధికారంలోకి వస్తే సెల్‌ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన  మొబైల్ కంపెనీని ఎంచుకున్నట్లుగానే... ఢిల్లీవాసులు తమకు తక్కువ ధరకు విద్యుత్తు అందించే కంపెనీని ఎంచుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2022నాటికి మురికివాడలు లేని నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని మోదీ హామీ ఇచ్చారు.

 

 అవినీతి రహిత పాలనకు పెద్దపీట

 ‘‘నన్ను నమ్మండి. ఈ వ్యవస్థను బాగుచేస్తా. అవినీతి రహిత పాలనకు పైస్థాయిలో బీజాలు పడ్డాయి. క్రమక్రమంగా కిందిస్థాయి వరకు చేరుకుంటుంది. ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లు, షాపుల యజమానులు, పేదలు డబ్బులిచ్చుకునే పరిస్థితి ఉండదు’’ అని మోదీ చెప్పారు. పేదలకు ఇంతకుముందు ఖాతాలిచ్చేందుకు బ్యాంకులు విముఖత వ్యక్తం చేసేవని, అయితే ‘జన్‌ధన్ యోజన’ పథకంతో దేశంలో ఇప్పటివరకు 11 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయని వివరించారు. జీరో బ్యాలెన్స్‌తో ఒక్క ఢిల్లీలోనే ఈ పథకం కింద 19.50 లక్షల ఖాతాలు తెరిచారని పేర్కొన్నారు.

 

  పేదల పక్షం నిలుస్తామని చెబుతున్న కాంగ్రెస్‌పైనా మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఎవరిది పేదల ప్రభుత్వమో మీరే నిర్ణయించండి. పేదల కోసం ఎవరు జన్‌ధన్ యోజన ప్రవేశపెట్టారు’’ అని ప్రశ్నించారు. ఢిల్లీకి 24 గంటల విద్యుత్ అందించి, జనరేటర్ల శబ్ద కాలుష్యం నుంచి నగరానికి విముక్తి ప్రసాదిస్తామన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరందిస్తామని, ఢిల్లీకి హర్యానా నుంచి అదనంగా నీటిని రప్పించేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడామని వివరించారు. ఢిల్లీలో అబద్ధాల ఫ్యాక్టరీ నడుస్తోందని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లకు తగ్గిస్తారని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలని, మోదీ వెన్నుపోటు పొడిచే వాడు కాదని చెప్పారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి బుద్ధి చెప్పాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని వేర్పాటువాదుల అజెండాను ఓడించారన్నారు.

 

 వెంకయ్యపై మోదీ ప్రశంసల జల్లు

 సాక్షి, న్యూఢిల్లీ: మోదీ తన ప్రసంగంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై ప్రశంసల జల్లు కురిపిం చారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు సమస్యలు తెలిసిన నేత అని కొనియాడారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ గురించి ఎంతగా తెలుసో.. ఢిల్లీలోని గల్లీగల్లీలోని సమస్యలపైనా వెంకయ్యనాయుడికి అంతగా తెలుసునన్నారు. ఆయనకున్న అవగాహన చూసి తానే ఆశ్చర్యపోయానన్నారు. ‘‘మా ప్రభుత్వంలోని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడిని నేను ఒక రోజు అడిగా.. ‘మీరు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి అయినా, ఢిల్లీలోని ఈ గల్లీలకు ఎప్పుడు పోయారు’ అని.

 

  అందుకు ఆయన బదులిస్తూ.. ‘మోదీజీ.. నేను ఢిల్లీవాసులను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటున్నా’ అని చెప్పారు. ఇంత తక్కువ సమయంలోనే ఢిల్లీలోని స్థానికుల ఇబ్బందులను గుర్తించి, భవిష్యత్తులో ఢిల్లీవాసుల జీవన వికాసానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అడుగు మందుకు వేస్తున్న  వెంకయ్యనాయుడిని అభినందిస్తున్నా’’ అని మోదీ అన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ... సార్వత్రిక ఎన్నికల్లో ప్రదర్శించిన విజ్ఞతను మళ్లీ చూపాలని ఓటర్లను కోరారు. ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే లక్ష ఇళ్లు నిర్మిస్తామని, ఏడాదిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top