కశ్మీర్‌కు భారీ ఎత్తున భద్రతా దళాలు

Narendra Modi Government Decided Send 38,000 More Troops Kashmir - Sakshi

కశ్మీర్‌: నరేంద్ర మోదీ ప్రభుత్వం 38 వేల మంది అదనపు దళాలను జమ్మూకశ్మీర్‌కు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. 10 వేల మంది, 28 వేల మంది వారిగా రెండు బ్యాచులుగా బలగాలను కశ్మీర్‌ లోయలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. కశ్మీర్‌లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో శాంతి భద్రతలు మెరగు పడ్డాయని స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్‌ రెడ్డి రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘2018తో పోలిస్తే.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు మెరుగు పడ్డాయి. ఉగ్ర చొరబాట్లు 43శాతం, ఉగ్రవాద సంఘటనలు 28 శాతం తగ్గాయి. భద్రతా దళాలు ప్రారంభించిన చర్యలు 59శాతం పెరగడంతో.. ఉగ్రవాదుల చర్యలను తటస్థీకరించడంలో మంచి అభివృద్ధి సాధించాం’ అంటూ కిషన్‌ రెడ్డి గత నెల 24న రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. భద్రతా దళాల కృషి వల్ల ఇప్పటి వరకూ 126 మంది ఉగ్రవాదులను అంతమోందించినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా కశ్మీర్‌కు 38 వేల మంది దళాలను పంపాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు.. ‘కశ్మీర్‌లో ఉగ్రకార్యకలపాలు తగ్గాయి.. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయంటూనే.. ఇంత భారీ ఎత్తున దళాలను ఎందుకు మోహరిస్తున్నారు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే రానున్న శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్‌, కశ్మీర్‌లో భారీ ఎత్తున చొరబాట్లను ప్రోత్సాహిస్తూ.. లోయలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నింస్తుందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర భారీ ఎత్తున దళాలను కశ్మీర్‌లో మోహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతే కాక ఈ ఏడాదిలో కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top