ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ

Modi Urges Indians To Watch Chandrayaan Wonder - Sakshi

బెంగుళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2 ల్యాండర్‌ జాబిల్లిపై కాలు మోపుతున్న అరుదైన క్షణాల్ని భారత ప్రజలంతా వీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రయాన్‌-2 ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధృవంపై దిగనుంది. ఈ దృశ్యాలను బెంగళూరులోని ఇస్రో సెంటర్‌లో పలువురు విద్యార్థులతో కలిసి మోదీ వీక్షించనున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. 

చంద్రయాన్‌-2 ల్యాండర్‌ జాబిల్లి దిగే క్షణాల్ని ఆస్వాదించడానికి బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో ఉండడం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుందని మోదీ అన్నారు. తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు భూటాన్‌ నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు ఈ అద్భుతాన్ని వీక్షించనున్నట్టు మోదీ తెలిపారు. చంద్రయాన్‌-2తో భారత్‌ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 22న చంద్రయాన్‌–2 ప్రయోగం ప్రారంభమైనప్పటి నుంచి.. దానికి సంబంధించి ప్రతి అంశాన్ని గమనిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. 

అలాగే ఈ అద్భుతాన్ని వీక్షిస్తున్న ప్రజలు తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని మోదీ కోరారు. వాటిలో కొన్నింటిన్ని తాను రీ ట్వీట్‌ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, మిషన్‌చంద్రయాన్‌–2 విజయం సాధిస్తే మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్‌ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ అరుదైన ఘనత  సాధించడం ద్వారా భారత శాస్త్రవేత్తల ప్రతిభ ప్రపంచానికి తెలియనుందని మోదీ అన్నారు. ఈ మిషన్‌ విజయం సాధిస్తే కోట్లాది భారతీయులకు ప్రయోజనం కలగనుందని మోదీ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top