‘కనీస ఆదాయం’ కష్టమే!

Minimum Income Scheme is difficult to implement - Sakshi

దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ – ప్రారంభించి చేతులెత్తేసిన వివిధ దేశాలు

పేదరికానికి అసలైన కొలమానమేదీ? – దీన్ని అమలుచేస్తే.. సంక్షేమ పథకాలు ఆపేయాల్సిందే  

2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ కనీస ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిరుపేదలకు డబ్బులు ఇవ్వడం వల్ల కలిగే లాభమేంటి? మన దేశంలో ఇలాంటి పథకాల అమలు సాధ్యమా? దేశ ఆర్థికాభివృద్ధికి దీనివల్ల ఎంతమేర ప్రయోజనం ఉంటుందన్న చర్చ సాగుతోంది.

సార్వత్రిక కనీస ఆదాయం అంటే? 
దేశంలో పేదరికం నిర్మూలన, ఆకలి కేకలు రూపు మాపడానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల స్థానంలో.. ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం చేయడమే ఈ యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ (యూబీఐ) ముఖ్య ఉద్దేశం. ప్రజల సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యం, వారి ఉపాధితో సంబంధం లేకుండా నిర్ణీత సొమ్మును.. ప్రజలకు నేరుగా అందించడాన్ని సార్వత్రిక కనీస ఆదాయంగా పిలుస్తారు. 

2016–17 ఆర్థిక సర్వే ప్రకారం..  
2016–17 ఆర్థిక సర్వే యూబీఐని పూర్తిగా సమర్థించింది. ఈ పథకాన్ని అమల్లోకి తెస్తే సామాజికంగా ప్రతీ ఒక్కరికి గౌరవ ప్రదమైన జీవితం ఉంటుందని అభిప్రాయపడింది. అయితే రాహుల్‌ ప్రకటించిన పథకం ప్రజలందరికీ కాకుండా కేవలం నిరుపేదలకు మాత్రమే ఉద్దేశించింది. ఆ లెక్కన చూస్తే నిరుపేదలంటే ఎవరు? ఎలా గుర్తించాలి? దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2004–05 సంవత్సరంలో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా సురేష్‌ టెండూల్కర్‌ అధ్యక్షతన అప్పటి జాతీయ గణాంక సంస్థ ఏడాదికి రూ.5,400 కన్నా తక్కువ సంపాదన ఉన్నవారంతా పేదలేనని స్పష్టం చేసింది. టెండూల్కర్‌ దారిద్య్రరేఖ ఆధారంగా 2016–17లో నాటి ధరలను అనుసరించి ఏడాదికి రూ.7,620 ఆదాయం కలిగిన వారిని నిరుపేదలుగా ఆర్థిక సర్వే గుర్తించింది. అలా చూస్తే దేశంలో 22% జనాభా యూబీఐ పథకానికి అర్హులు. వారందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తే దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో (జీడీపీ) 4.9% వ్యయం అవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం జీడీపీలో 5.2% ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి దాని స్థానంలో కనీస ఆదాయ పథకాన్ని తీసుకువస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడదని ఆర్థిక సర్వే వివరించింది. 

యూబీఐ ఎందుకు? 
సార్వత్రిక కనీస ఆదాయ పథకం కొత్తదేం కాదు. ఇప్పటికే కొన్ని దేశాలు దీనిపై భారీగా కసరత్తు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, రెండోది ఉపాధిరంగంలో ఆటోమేషన్‌ కారణంగా ఉద్యోగావకాశాలు లేకపోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ప్రభుత్వాలే ఎంతో కొంత నగదు రూపంలో సాయం చేస్తే వారి భుక్తికి లోటు ఉండదన్న అభిప్రాయంతో యూబీఐ దిశగా చాలా దేశాలు అడుగులు వేస్తున్నాయి. 

బ్రెజిల్‌ మినహా విఫలమే!  
బ్రెజిల్, ఫిన్‌లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీలతో పాటు మరికొన్ని దేశాల్లో యూబీఐని వివిధ రూపాల్లో అమలు చేస్తున్నారు. కానీ బ్రెజిల్‌ మినహా ఎక్కడా ఇది విజయవంతమైన దాఖలాలు లేవు. బ్రెజిల్‌లో 2003 నుంచి ఈ పథకం అమల్లోనే ఉంది. దీని ద్వారా ఆ దేశంలో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. ఫిన్‌లాండ్‌ ప్రభుత్వం.. నిరుద్యోగులకు రెండేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేసి ఇక మావల్ల కాదని చేతులెత్తేసింది. కెనడా కూడా సంక్షేమ పథకాల స్థానంలో యూబీఐ ఎంతవరకు పని చేస్తుందో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది. కానీ రెండు నెలల్లోనే అమలు చేయలేక నిలిపివేసింది. 

భారత్‌లో అమలు చేయలేమా? 
నిరుపేదలకు కనీస ఆదాయ పథకం కిందకు వచ్చే పేదలకు కొలమానం ఏమిటన్న దానిపైనే భారత్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి. టెండూల్కర్‌ దారిద్య్ర రేఖ ఫార్ములాపై వచ్చినన్ని విమర్శలు మరి దేని మీద రాలేదు. దీని ప్రకారం 2011–12లో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి ఒక వ్యక్తి సగటున పెట్టే ఖర్చు రూ.27.2 కంటే తక్కువగా ఉంటే పేదలని, అదే పట్టణ ప్రాంతాల్లో రూ.33.3 కంటే తక్కువ ఖర్చు పెట్టేవారు పేదలని పేర్కొన్నారు. మార్కెట్‌లో ధరలెలా ఉన్నాయో టెండూల్కర్‌ కమిషన్‌కు అసలు తెలుసా? అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో 2014లో సి.రంగరాజన్‌ అధ్యక్షతన కమిటీ నిరుపేద కుటుంబాలను సందర్శించి గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి ఒక వ్యక్తి సగటున రూ.32 కంటే తక్కువ ఖర్చు చేస్తే పేదలని, అదే పట్టణ ప్రాంతాల్లో రూ.47గా నిర్ణయించింది. దీని ప్రకారం దేశ జనాభాలో 29.5% మంది నిరుపేదలని పేర్కొంది. అయితే పేదరిక నిర్మూలనపై నీతి ఆయోగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ టెండూల్కర్‌ కమిషన్‌ సిఫారసులనే సమర్థించింది. ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదట దుర్భరమైన దారిద్య్రాన్ని నిర్మూలించడమే మొదటి ప్రాధాన్యమని పేర్కొంది.

130 కోట్లకి పైగా జనాభా ఉన్న మన దేశంలో నిరుపేదలెవరో గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించడం పెద్ద సవాలే. వృద్ధులు, వితంతువులు, నిరుద్యోగులు వంటివారికి నగదు ప్రత్యక్ష బదిలీ వంటి పథకాలు ఆధార్‌ అనుసంధానంతోనే జరుగుతున్నాయి. కానీ ఇందులో ఎన్నో అవకతవకలు చోటుచేసుకుని నిజమైన లబ్ధిదారులకు అందడం లేదు. రాహుల్‌ హామీ అమలు కూడా ఆచరణలో అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఎల్‌పీజీ సబ్సిడీ, గ్రామ్‌ సడక్‌ యోజన, మధ్యాహ్న భోజన పథకం, ఆవాస్‌ యోజన, స్వచ్ఛభారత్‌ వంటి పథకాలు దీర్ఘకాలంలో మానవాభివృద్ధికి తోడ్పడే పథకాలు.

వాటికి బదులుగా నగదుని పంచిపెట్టడం ఏమాత్రం ప్రయోజనకరం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఎలాంటి శ్రమ చేయకుండా నెల తిరిగేసరికి ఎంతో కొంత డబ్బు బ్యాంకు అకౌంట్లలో పడుతూ ఉంటే, ఆ డబ్బుల కోసం ఎదురు చూడటంలోనే జనం మునిగిపోతారే తప్ప పని చేసేందుకు ఆసక్తి చూపరు. ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోయి దేశాభివృద్దే ప్రమాదంలో పడుతుందని ఆర్థికవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర మానవాభివృద్ధి సూచిలో 189 దేశాలకుగాను భారత్‌ 130వ స్థానంలో ఉంది. ఈ సమయంలో ఇలాంటి పథకాలు తీసుకురావడం వల్ల దేశానికి జరిగే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top