మోదీకి చేతకానిది రాహుల్‌కు అయ్యేనా!

Mill Workers Angry With Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించినట్లయితే మూతపడిన కాచర్‌ పేపర్‌ మిల్లును కచ్చితంగా తెరిపిస్తాం. ఉద్యోగావకాశాలను పెంపొందించడమే కాకుండా వెనకబడిన అస్సాం ఆర్థికాభివద్ధికి ఇది ఎంతైన అవసరం’ అని ప్రధాని నరేంద్ర మోదీ 2016, మార్చి 27వ తేదీన పేపర్‌ మిల్లుకు పది కిలోమీటర్ల దూరంలోని కాలినగర్‌లో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. నాడు మోదీ చేసిన ప్రసంగం కాచర్‌ పేపర్‌ ప్రతి కార్మికుడి సెల్‌లో నేడు నిక్షిప్తమై ఉంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ పేపర్‌ మిల్లును తెరిపించేందుకు అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

లోపాయికారిగా ప్రైవేటు సంస్థలకు ఈ మిల్లును అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మళ్లీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఏప్రిల్‌ 11వ తేదీన పేపర్‌ మిల్లుకు సమీపంలోని సిల్చార్‌ పట్టణానికి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ‘లయ్యర్‌ నరేంద్ర మోదీ, గో బ్యాక్‌’ అంటూ ఆందోళన చేసిన పేపర్‌ మిల్లు ఉద్యోగులను పోలీసుల అరెస్ట్‌ చేసి అనంతరం విడుదల చేశారు. వారి ఆందోళన గురించి ముందుగానే పసిగట్టిన స్థానిక పోలీసులు 47 మంది ఉద్యోగులను ముందస్తుగా నిర్బంధించి మోదీ వెళ్లిపోయాక విడుదల చేశారు. ఈ మిల్లులో ప్రత్యక్షంగా 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

2015, అక్టోబర్‌ నెలలో
కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘హిందుస్థాన్‌ పేపర్‌ కార్పొరేషన్‌’ అధ్వర్యంలో నడుస్తున్న కాచర్‌ పేపర్‌ మిల్లును అనూహ్యంగా 2015, అక్టోబర్‌ నెలలో మూసివేశారు. ఆ మరుసటి నెల నుంచి ఉద్యోగుల వేతనాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మిల్లును మూసివేశారో, ఎందుకు జీతాలు ఇవ్వడం లేదో అధికారికంగా వివరణ ఇచ్చిన వారుగానీ తెలిపేవారుగానీ లేరు. పేపర్‌ మిల్లును కాయిలా పడిందనో, దివాలా తీసిందనో, లేదా మూసివేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటిస్తే తమకు కనీసం నష్టపరిహారం అందుతుందని, ఏది లేకుండా తమ జీవితాలు గాలిలో దీపాలయ్యాయని రోడ్డున పడ్డ నిరుద్యోగులు వాపోతున్నారు.

మరో మిల్లు కూడా మూత, పలువురి మృతి
మిల్లును తెరుస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చాక అంటే, 2017 మార్చినెలలో కాచర్‌ పేపర్‌ మిల్లుకు అనుబంధంగా నడుస్తున్న నవ్‌గాంగ్‌ పేపర్‌ మిల్లును కూడా మూసివేశారు. రెండు మిల్లుల్లో కలిసి 1200 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు మిల్లులపై ఆధారపడి వెదరు బొంగులు కోసేవారి నుంచి సరఫరా దారుల వరకు దాదాపు రెండు లక్షల మంది జీవిస్తున్నారు. మిగతా వారి సంగతి తెలయదుగాని కాచర్‌ మిల్లులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 50 మంది వైద్య చికిత్సలకు డబ్బుల్లేక మరణించారని మిల్లు పునరుద్ధరణ కమిటీ చీఫ్‌ కన్వీనర్‌ మనబెండ చక్రవర్తి తెలిపారు. నవ్‌గాంగ్‌ (నవ్‌గామ్‌) పేపర్‌ మిల్లుకు చెందిన ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలకు ఎన్ని విజ్ఞప్తులు చేసిన ఫలితం ఉండడం లేదని వాపోయారు. ఈ మిల్లులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం కోసమే మూసివేశారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఉద్యోగుల సంఘం నాయకుడొకరు ఆరోపించారు. మిజోరమ్, త్రిపుర రాష్ట్రాల నుంచి ఈ పేపర్‌ మిల్లులకు వెదురు సరఫరా అవుతుండేదని ‘బాంబూ ఫ్లవరింగ్‌ (పూత పూసాక చెట్లు చనిపోవడం)’ కారణంగా కొరత ఏర్పడి ఖర్చు పెరగడంతో మిల్లులను మూసివేయక తప్పలేదని సీనియర్‌ మిల్లు అధికారి ఒకరు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మాటలు నమ్మి మోసపోయామని, రేపటి ఎన్నికల్లో మోదీ పార్టీకి ఓటు వేయకూడదని కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగులమంతా తీర్మానించుకున్నామని పలువురు ఉద్యోగులు మీడియాకు తెలిపారు. ఏప్రిల్‌ 18వ తేదీన లోక్‌సభకు అక్కడ పోలింగ్‌ జరుగుతుంది.

మేం అధికారంలోకి వస్తే తెరిపిస్తాం!
‘కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మూత పడిన రెండు మిల్లులను తెరిపిస్తాం. కాకపోతే కాస్త సమయం పట్టవచ్చు’ అస్సాంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top