పాము కాటుకు 7 నెలల్లో 49 వేల మంది బలి

Maharashtra records most snake bite cases in India in 2017 - Sakshi

దేశంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య 10,735 మంది మృత్యువాత

సాక్షి, బెంగళూరు: రోడ్డు ప్రమాదాల తరువాత విష సర్పాలే భారతీయులను అధికంగా బలి తీసుకుంటున్నాయి. భారత్‌లో పాము కాటు కారణంగా కేవలం ఏడు నెలల్లో 49,000 మంది చనిపోయారు. పాము కాటు వల్ల చనిపోతున్న వారిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో, కర్ణాటక ఐదో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుండి అక్టోబర్‌ 31 వరకు సేకరించిన గణాంకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసింది.

ఈ ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా 1.14 లక్షల మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో 94,874 మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉన్నారు. మొత్తం బాధితుల్లో 49,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 24,437 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 10,735 మంది, తెలంగాణలో 4,079 మంది పాము కాటుకు గురయ్యారు. విష సర్పాల బారిన పడిన వెంటనే చికిత్స పొందక బాధితుల్లో 48 శాతం మంది మృత్యువాత పడుతున్నారు.

ఆసుపత్రుల్లో యాంటీ వీనమ్‌ కొరత
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఆరు బయట నిద్రించడం, ఇళ్లల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెల్లడం, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో పాము కాటుకు గురవుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్స తీసుకోవాలో తెలియకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనమ్‌ అందుబాటులో లేకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పాము కాట్లు, చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెంచితేనే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top