ఎంత కష్టం!

Maharashtra Farmers March From Nashik To Mumbai - Sakshi

మండుటెండలో రోజుకి 30 కి.మీ. నడక

పాదాలు బొబ్బలెక్కినా చెదరని సంకల్పం

చెప్పులు తెగిపోయాయి. కాళ్లు బొబ్బలెక్కిపోయాయి.. నడిచి నడిచి అరిపాదాలకు పుళ్లు పడి రక్తాలు కారాయి. తినడానికి సరైన తిండి లేదు. నిద్రపోవడానికి అనువైన జాగా దొరికేది కాదు.  మార్చిలోనే మాడుపగిలే ఎండలతో నిస్సత్తువ ఆవహించేది. అయినా  మహారాష్ట్ర రైతన్నల అడుగు తడబడలేదు. నడక ఆగలేదు. వారి సంకల్ప బలం చెక్కు చెదరలేదు. అందరి కడుపులు నింపే అన్నదాతలు తమ ఆకలి తీరే మార్గం కోసం, బతుకు తెరువు కోసం చేసిన పాదయాత్ర యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. 

నాసిక్‌ నుంచి ముంబై వరకు మొత్తం 180 కి.మీ. సాగిన ఈ మార్చ్‌లో అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టనష్టాలు .. అన్నీ పంటి బిగువున భరించారు. అలుపు, సొలుపు లేకుండా  35 డిగ్రీల మండుటెండలో రోజుకి 30 కి.మీ. నడిచారు. మహారాష్ట్ర సర్కార్‌ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో తమకెదురైన ఇబ్బందులేమీ పట్టించుకోలేదు. మార్చి 6 నుంచి 11 వరకు వరసగా ఆరు రోజుల పాటు ఏకబిగిన నడిచారు. 

  • నాసిక్‌ నుంచి ముంబై వరకు పాదయాత్ర
  • మార్చి 6 నుంచి 11 వరకు 
  • ఆరు రోజులు సాగిన నడక 
  • నడిచిన దూరం 180 కి.మీ. 
  • మండుటెండలో రోజుకి 30 కి.మీ నడక
  • మార్చ్‌లో పాల్గొన్న 50 వేలకు పైగా రైతులు 
  • పాదాలకు పుళ్లు , డయేరియా, బీపీ  వంటి సమస్యలు
  • సోలార్‌ ప్యానెల్‌తో సెల్‌ చార్జింగ్‌లు 

ఒక్కో ఊరు దాటుతుంటే  ప్రవాహంలా మరికొందరు రైతులు వారి అడుగుకి అడుగు కలిపారు.   మరఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రైతులు కదం తొక్కారు. మొదటి రోజు 30 వేల మందితో మొదలైన మార్చ్‌ ఒక్కో రోజు గడుస్తూ ఉంటే రైతుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. ముంబై చేరుకునేసరికి 50 వేలు దాటేసింది. 

ఈ మార్చ్‌లో డెబ్భై ఏళ్ల వయసు దాటిన వారు, మహిళా రైతులు ఎక్కువగా కనిపించారు. ఆరురోజుల పాటు సాగిన నడకలో కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటికి కావల్సిన సదుపాయాలు లేకపోయినా నడిచారు. కొందరు రైతులు బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, వంట సామాగ్రి  ఇళ్ల నుంచి వెంట తెచ్చుకున్నారు. ఆ మూటల బరువుని మోస్తూనే నడక సాగించారు.

రోడ్డుపక్కనే వండుకొని తినడం, మళ్లీ నడవడం.. రాత్రయ్యేసరికి హైవేపక్కనో, ఏ మైదానాల్లోనో కాసేపు కునుకు తీయడం.. మళ్లీ లేచి నడక నడక.. అలా అదే పనిగా దుమ్ము, ధూళిలో 140 గంటల సేపు నడిచారు. మండుటెండల్లో నడవడం వల్ల డయేరియా, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి.   ‘మేము ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత కష్టం కాదు. మా జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. నెలకి అయిదు నుంచి ఆరు వేల రూపాయలు వస్తే ఎలా బతకాలి ? అందుకే ఎంతటి బాధనైనా తట్టుకున్నాం.  పాదాలు బొబ్బలెక్కడంతో రోజూ పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతూ నడక కొనసాగించాం‘ అని 74 ఏళ్ల వయసున్న శంకర్‌ గావిట్‌ అనే రైతు చెప్పారు.

రైతుల దుస్థితిని చూసి చాలా ఊళ్లల్లో స్థానికులే వారిని ఆదుకున్నారు. వారి అవసరాలు కాదనకుండా తీర్చారు.  మండే ఎండల్లో నడుస్తున్న రైతులు తమ సెల్‌ఫోన్‌లను చార్జ్‌ చేయడానికి సోలార్‌ ప్యానెల్‌ను వాడడం చాలా మందిలో ఆసక్తిని నింపింది. నెత్తి మీద సోలార్‌ ప్యానెల్‌ను పెట్టుకున్న కొందరు రైతులు అందరి మొబైల్స్‌ని చార్జ్‌ చేసి ఇచ్చారు. 

అంతటి∙కష్టంలోనూ రైతులు సాటి విద్యార్థుల కష్టాన్ని గుర్తించారు. ముంబైలో సోమవారం టెన్త్, ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండాలని ఆదివారం రాత్రంతా సియాన్‌నుంచి ఆజాద్‌ మైదాన్‌వరకు 15 కిమీ. నడిచారు. తెల్లవారేసరికి గమ్యస్థానానికి చేరుకున్నారు. 


మానవత్వాన్ని చాటుకున్న ముంబైవాసులు

అలుపుసొలుపు లేకుండా అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చిన రైతులకు ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. స్వచ్ఛందంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి రైతుల అవసరాలను అడిగి మరీ తీర్చారు. మంచినీళ్లు, ఆహారపొట్లాలను అందించారు. విద్యార్థులకు కష్టం కలగకుండా అర్థరాత్రి వరకు నడిచిన రైతులకు దారిలో అడుగడుగునా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, డబ్బావాలాలు ట్రక్కులతో మంచినీళ్లు, తిండిపదార్థాలు తీసుకువచ్చి పంచారు. పోహా, ఖర్జూరం, బిస్కెట్లు పంపిణీ చేశారు. మరికొందరు పాదరక్షలు కూడా ఇచ్చారు. పాదాలు పుళ్లు పడిపోయిన వచ్చిన రైతులకు వైద్య విద్యార్థులు ముందుకు వచ్చి చికిత్స చేశారు.  కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమించిన రైతులకు అనూహ్యంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించడంతో మహారాష్ట్ర సర్కార్‌ దిగి రావల్సి వచ్చింది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top