రైతుల కోసం తొలిసారి వినూత్న పథకం

Madhya pradesh government new scheme for farmers - Sakshi

సాక్షి, భోపాల్‌ : పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతన్న దేశంలో,  కనీస మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోలేని అసహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలున్న నేటి  పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. రైతుల పంటకు దన్ను, వారికి అండగా ఉండాలనే లక్ష్యంతో ‘భవంతర్‌ భుగ్దాన్‌ యోజన’ అనే సరికొత్త పథకాన్ని అక్టోబర్‌ 16 (సోమవారం)నాడు  ప్రారంభించింది. ఇప్పుడు ఈ పథకం పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. ఈ కొత్త పథకం ఎలాంటి ఫలితాలనిస్తుందన్నదే అందరిలో నెలకొన్న ఉత్కంఠ.

రైతుల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇకముందు అలాంటి అవసరం రాకుండా సరికొత్త స్కీమ్‌ను కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకం గురించి సులభంగా వివరించాలంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, వ్యాపారి సరకును కొనే «మార్కెట్‌ దరకున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించడం. మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్‌కు  1425 రూపాయలు ఉన్నట్లయితే, మార్కెట్‌ ధర 1225 రూపాయలు ధర పలికినట్లయితే, రెండింటి మధ్యనున్న తేడా 200 రూపాయలను ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ఇలా చెల్లించడమే కొత్త స్కీమ్‌ లక్ష్యం.

ఇప్పటి వరకు ఎలా ఉందంటే....
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అమలవుతున్న విధానం వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా 25 రకాల ఆహార, పప్పు దినుసులకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వస్తోంది. రైతులకు ఆ ధర వచ్చేలా చూడాల్సిన  బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వాలదే. సహజంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదవారికి పంపిణీ చేసే ఆహార, పప్పుదినుసలకే గిట్టుబాటు ధరను చెల్లించి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తుంటాయి. మిగతా సరకుల ధరను నియంత్రించేందుకు ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించడం, ఎక్కువ కాలం నిల్వ చేసుకునేందుకు వీలుగా రైతులకు ఎక్కువకాలం గిడ్డంగుల సౌకర్యం కల్పిస్తోంది.  ప్రభుత్వాల వద్ద చాలినన్ని గిడ్డంగులు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్, ప్రభుత్వ ప్రాథమ్యాల వల్ల ఈ ఇతర సరకులకు దాదాపు ఎప్పుడూ గిట్టుబాటు ధర లభించదు.

కనీస మద్దతు ధర కొన్నింటికే పరిమితం
ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే బియ్యం, గోధుమలు, కొన్ని రకాల పప్పులు, నూనె గింజలకే కనీస మద్దతు ధర లభిస్తుంది. ఈ కనీస మద్దతు ధరను ఆశిస్తున్న రైతులంతా కూడా ఈ సరకులనే ఉత్పత్తి  చేయడం వల్ల మార్కెట్లో అవసరానికి మించి ఉత్పత్తి పెరిగి మార్కెట్‌లో రేట్లు పడిపోవడం వల్లన పభుత్వం కూడా కనీస మద్దతును చెల్లించలేక పోతోంది. ఇందాక అనుకున్నట్లు మొక్కజొన్న కనీస మద్దతు ధరను కొనుగోలు చేయాలంటే ప్రభుత్వమే క్వింటాల్‌కు 1425 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అలా ఎంపిక చేసిన సరకులన్నింటినీ కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. దానికి బదులు కనీస మద్దతు ధరకు, మార్కెట్‌ ధరకు ఉన్న తేడాను చెల్లించినట్లయితే క్వింటాల్‌కు ప్రభుత్వం 200 రూపాయలు చెల్లిస్తే, అంటే భర్తీ చేస్తే సరిపోతుంది.

వ్యాపారులు కుమ్మక్కుకారా?
కనీస మద్దతు–మార్కెట్‌ ధరల మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరిస్తుందికదా? అని భావించే వ్యాపారులు అతి తక్కువ ధరకు సరకులను కొనేందుకు ప్రయత్నించరా, అందుకోసం వారంతా కుమ్మక్కుకారా? ఇలాంటి అవకాశం ఉండరాదనే ఉద్దేశంతోనే  స్కీమ్‌లో కొన్ని నిబంధనలు పెట్టారు.  ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి అక్టోబర్‌ 16వ తేదీలోగా తమ  పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర రైతులకు సూచించారు. అవకతవకలు జరుగకుండా దానికి ఆధార్‌ లేదా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జారీ చేసిన సమగ్ర కార్డును లింక్‌ చేశారు. ఈ రోజు  నుంచి తమ పేర్లు నమోదు చేసుకున్న రైతులు ప్రభుత్వం సూచించిన మార్కెట్‌ యార్డులకు వచ్చి తమ సరుకులను మార్కెట్‌ ధరలకు విక్రయించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ నెల వరకు మార్కెట్లో విక్రయాలు కొనసాగుతాయి. డిసెంబర్‌ 16వ తేదీ నుంచి రైతులు అమ్మిన సరకుకు, దాన్ని వ్యాపారులు కొనుగోలు చేసిన మార్కెట్‌ ధరకు తేడా ఎంత ఉందో లెక్కగట్టి ఆ తేడా సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాలకు పంపిస్తుంది.

పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తారు
ఇక వ్యాపారులు కుమ్మక్కై మార్కెట్‌ ధరను తక్కువగా చూపకుండా ఉండేందుకు సొంత రాష్ట్రం ధరను, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో  మినప పప్పు క్వింటాల్‌ ధర 3,000 రూపాయలు, రాజస్థాన్‌లో 3,700 రూపాయలు, ఉత్తర ప్రదేశ్‌లో 3,900 రూపాయలు ఉందనుకుంటే మార్కెట్‌ ధరను మూడు రాష్ట్రాల సరాసరి 3,500 రూపాయలుగా అంచనా వేస్తుంది. ఇక  కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 5,400 రూపాయలనుకుంటే మార్కెట్‌ ధర 3,500 రూపాయలు పోనూ రైతులకు ప్రభుత్వం క్వింటల్‌కు 1900 రూపాయలు చెల్లిస్తుంది. ఇలా అంకెల్లో చెప్పుకుంటూ  పోతుంటే స్కీమ్‌ బాగానే ఉందనిపించవచ్చు. మార్కెట్‌ శక్తులను ఎప్పుడూ నమ్మలేమని, అవి ఎప్పుడూ ఇటు రైతులను, అటు ప్రభుత్వాలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్కీమ్‌లో  కూడా వ్యాపారులు పక్క రాష్ట్రాల వ్యాపారలను కలుపుకొని కుమ్మక్కే అవకాశం ఉందని, ప్రభుత్వం చెల్లిస్తుందంటూ రైతులను తక్కువ ధరకు కొనేలా ప్రలోభా పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని  వారంటున్నారు.

మోసం జరిగే అవకాశం లేదా?
అంతేకాకుండా పంట చేతికొచ్చాక మార్కెట్‌ నాలుగు నెలలు మాత్రమే క్రియాశీలకంగా  ఉంటుందని, ఇక్కడ ప్రభుత్వం సూచిస్తున్న గడువుకూడా నాలుగు నెలలో కావడంతో ఒకేసారి  పంట రావడం  వల్ల పోటీ ఎక్కువై మార్కెట్‌ ధరలు మరీ పడిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చాలాసార్లు కనీస మద్దతు ధరకూడా శాస్త్రీయంగా ఉండదని వారు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోనే రైతుల సమ్మెను విరమింప చేసేందుకు ఉల్లిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై నెలలో హామీ ఇచ్చింది. అప్పుడు మార్కెట్‌లో దాని ధర, 2 నుంచి 3 రూపాయలే. ప్రభుత్వం 8 రూపాయల చొప్పున  కనీస మద్దతు ధరను చల్లించి కొనుగోలు చేసింది. వాస్తవానికి పంటకు, దాన్ని మార్కెట్‌కు తరలించేందుకు రైతుకు 20 రూపాయలకు కిలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌ తీసుకొచ్చిన సరికొత్త  స్కీమ్‌ను కేంద్ర మేథావులు సంస్థ ‘నీతి ఆయోగ్‌’ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top