కోటా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha passes bill to provide 10 per cent quota for poor sections - Sakshi

అనుకూలంగా 323 మంది, వ్యతిరేకంగా ముగ్గురు ఓటు

 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు

 బిల్లు కోర్టులో నిలబడగలదా? అని విపక్షాల అనుమానం 

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనూహ్యంగా.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేందుకు రెండు రోజుల ముందు.. ఈ బిల్లును మోదీ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. సోమవారం బిల్లుకు కేబినెట్‌ ఆమోదం, ఆ వెంటనే మంగళవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడం, అధికార, విపక్ష సభ్యులు పాల్గొన్న చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. సభ ఆమోదం కోసం ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా.. బిల్లును తీసుకువచ్చిన సమయాన్ని, ప్రభుత్వ ఉద్దేశాన్ని మాత్రమే విపక్షాలు విమర్శించాయి.

అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్‌ఎస్, బీజేడీ, ఎస్పీ, బీఎస్పీ, తదితర ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతిచ్చాయి. దాంతో 323–3 తేడాతో బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. ఎంఐఎం, ఆలిండియా ముస్లిం లీగ్‌ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించాయి. అన్నా డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ బిల్లు కోసమే మంగళవారమే నిరవధికంగా వాయిదా పడాల్సిన రాజ్యసభ గడువును ఒకరోజు పొడిగించారు.

న్యూఢిల్లీ
విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక బిల్లు ఒక అడ్డంకిని అధిగమించింది. 124వ రాజ్యాంగ సవరణతో తెచ్చిన ఈ బిల్లును మంగళవారం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభకు హాజరైన వారిలో మూడింట రెండింతలకు పైగా మెజారిటీతో ఆమోదం పొందింది. సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన చర్చ అనంతరం చేపట్టిన ఓటింగ్‌లో 323 మంది బిల్లుకు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఓటేశారు. ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు,  సామాజిక సమీకరణల దృష్ట్యా ఎంతో కీలకమైన ఈ బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. బిల్లు ఆమోదం పొందిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభలోనే ఉన్నారు.

దేశ ప్రయోజనాల రీత్యా తీసుకొచ్చిన ఈ బిల్లు చారిత్రకమని ప్రభుత్వం పేర్కొనగా, ఎన్నికల జిమ్మిక్కని విపక్షాలు పెదవి విరిచాయి. అది న్యాయ ప్రక్రియ పరీక్షకు నిలబడగలదా అని సందేహం లేవనెత్తాయి. బిల్లులోని నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్నా డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేయగా,  ఇండియన్‌ ముస్లిం లీగ్, హైదరాబాద్‌ పార్టీ ఏఐఎంఐఎంలు బిల్లును వ్యతిరేకించాయి. ఓటింగ్‌ అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. 

సుప్రీంకోర్టులోనూ గట్టెక్కుతుంది: గహ్లోత్‌ 
చర్చ ముగిశాక మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ విపక్షాల అభ్యంతరాలకు సమాధానమిచ్చారు. ఒకవేళ బిల్లు న్యాయ సమీక్షకు వెళ్లినా, సుప్రీంకోర్టు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విపక్షాల ఆందోళనలన్నీ నిరాధారమని, వాటి గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’కు పాటుపడతామన్న ఎన్డీయే దార్శనికతకు అనుగుణంగానే ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు. అగ్రవర్ణాల్లోనూ పేదలు దుర్బర జీవితం గడుపుతున్నారని, వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో పలు కమిటీలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసినా, తమ ప్రభుత్వమే దాన్ని నిజం చేసిందని పేర్కొన్నారు. 

రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు: జైట్లీ 
చర్చ మధ్యలో జోక్యం చేసుకున్న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ..ఈ బిల్లును రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సిన అవసరంలేదని, రాజ్యసభలో గట్టెక్కిన తరువాత రాష్ట్రపతి సంతకం చేస్తే చట్టరూపం దాలుస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి కుల ఆధారిత రిజర్వేషన్లకే వర్తిస్తుందని, కానీ తాజా బిల్లులో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించామని తెలిపారు. సుప్రీంకోర్టు సమీక్షలో ఈ బిల్లు  విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక స్థోమత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు గతంలోనూ కేంద్రం, రాష్ట్రాల స్థాయుల్లో జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. నోటిఫికేషన్లు, సాధారణ చట్ట నిబంధనల ద్వారా చేయడం వల్లే అలా జరిగిందని అభిప్రాయపడ్డారు. సామాజికంగా, ఆర్థికంగా పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో ఇలాంటి కోటాను చేర్చిందని, దానికి చాలా పార్టీలు మద్దతుపలికాయని గుర్తుచేశారు. ప్రైవేట్‌ రంగంలోనూ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కోరారు. 

హడావుడిగా తెచ్చారు: విపక్షాలు 
లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర హడావుడిగా ఈ బిల్లు తెచ్చిందని, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు చేసిన గిమ్మిక్కని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆర్థిక స్థోమత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు గతంలో పీవీ నరసింహరావు చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతిని గుర్తుచేశాయి. హడావుడిగా తీసుకొచ్చిన ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయని, వాటిని అధ్యయనం చేసేందుకు జేపీసీకి పంపాలని కాంగ్రెస్‌ సూచించింది. ఉద్యోగాలే లేనప్పుడు 10 శాతం కోటా ఎందుకని  సీపీఎం ఎంపీ జితేంద్ర చౌదరి ప్రశ్నించారు. ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టేస్తుందని ఐఎన్‌ఎల్‌డీ సభ్యుడు దుష్యంత్‌ చౌతాలా అన్నారు.

బిల్లులో లోపాలు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఎన్నికల వేళ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ బిల్లులో అనేక లోపాలున్నందున న్యాయ సమీక్షకు నిలబడలేదని చెప్పారు. లోక్‌సభలో బిల్లుపై చర్చలో ఎవరు ఏమన్నారంటే.. 

కేవీ థామస్, కాంగ్రెస్‌ 
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గతంలో పీవీ నరసింహారావు చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మోదీ ప్రభుత్వం హడావుడిగా తెచ్చిన ఈ బిల్లులో అనేక లోపాలున్నాయి. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి జనరల్‌ కేటగిరీలో 10% కోటా కల్పించేందుకు సోమవారం కేబినెట్‌ ఆమోదం తెలపగా మంగళవారం పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ చర్య ప్రభుత్వ చిత్తశుద్దిపై అనేక అనుమానాలకు తావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన ఎత్తుగడగా కనిపిస్తోంది. 

అసదుద్దీన్‌ ఒవైసీ, ఏఐఎంఐఎం 
రాజ్యాంగాన్ని మోసం చేసే, అంబేడ్కర్‌ను అవమానించేలా ఉన్న ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశం. దీంతోపాటు సామాజిక, విద్యా వెనుకబాటు తనాన్ని ఇది తొలగిస్తోంది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను రాజ్యాంగం గుర్తించడం లేదు. ఎలాంటి కచ్చితమైన సమాచారం, ఆధారం లేకుండా ప్రభుత్వం చేస్తున్న ఈ మొత్తం ప్రయత్నం ఒక మోసం. దీనివల్ల రాష్ట్రాలపై భారం పడుతుంది. మరాఠాలకు రిజర్వేషన్లపై ఏం జరగనుందో ప్రభుత్వం నుంచి తెలుసుకోవచ్చా? ఈ బిల్లు కూడా సుప్రీంకోర్టులోనే ఆగిపోతుంది.

ఎం.తంబిదురై, ఏఐఏడీఎంకే 
ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కాకుండా సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్‌ ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలు తీసుకువచ్చింది. అయితే, అవన్నీ విఫలం కావడం వల్లే ప్రభుత్వం రిజర్వేషన్‌ బిల్లు తీసుకువచ్చిందా? 

సుదీప్‌ బందోపాధ్యాయ, తృణమూల్‌ కాంగ్రెస్‌ 
ఉద్యోగాలు కల్పించటానికి బదులు యువతను తప్పుదోవ పట్టించటానికే ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టింది. ఇది కేవలం భ్రమ..వాస్తవ రూపం దాల్చదు. హామీ ఇవ్వడమే తప్ప రిజర్వేషన్‌ అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అయినా, ఈ బిల్లుకు మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. 

 ఆనంద్‌రావ్‌ అడ్సుల్, శివసేన 
ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఆలస్యంగానైనా ఇవ్వడం మంచిదే. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. 

 బి.మహ్తాబ్, బిజూ జనతాదళ్‌ 
సవరణలు ప్రతిపాదించేందుకు ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ‘ప్రత్యేక ఎజెండా’తో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
 
జితేంద్ర చౌధురి, సీపీఎం 
జనరల్‌ కేటగిరీలో 10% కోటా కల్పించాలని ప్రభుత్వం యత్నిస్తోంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగాలెక్కడున్నాయి? ఈ బిల్లును మరింత సమగ్రంగా మార్చేందుకు జేపీసీ లేదా స్టాండింగ్‌ కమిటీకి పంపాలి. 

సుప్రియా సులే, ఎన్‌సీపీ 
ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ చివరి సమావేశాల్లో చివరి రోజు హడావుడిగా ఎందుకు ప్రవేశపెడుతుంది? సుప్రీంకోర్టులో ఈ బిల్లు ఆగిపోతుందని స్వయంగా కేబినెట్‌ మంత్రి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. 

 ధర్మేంద్ర యాదవ్, ఎస్‌పీ 
రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎన్నికల గిమ్మిక్కేనని ఉన్నత కులాల వారికీ తెలుసు. 

జై ప్రకాశ్‌ నారాయణ్‌ యాదవ్, ఆర్‌జేడీ 
హడావుడిగా ఈ బిల్లును తీసుకురావడం అగ్ర కులాల వారిని మోసగించేందుకు తప్ప మరేమీ కాదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top