ప్రత్యేక అతిథిగా రావడం వెనుక ఓ ప్రేమకథ!

Kim Jung Sook Special Guest For Ayodhya Diwali Celebrations Here Is The Special Reason - Sakshi

లక్నో : దేశమంతా దివ్వెల పండుగ సంబరాల్లో మునిగిన వేళ సరయూ నది తీరంలో ఒకేసారి ఏకంగా మూడు లక్షల పైచిలుకు మట్టి ప్రమిదలు వెలిగించి ఉత్తరప్రదేశ్‌ ప్రజలు గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. మంగళవారం అయోధ్యలో యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ వేడుకకు దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్‌ జుంగ్‌ సూక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు దక్షిణ కొరియా అత్యున్నత స్థాయి అధికారుల బృందం కూడా వచ్చింది. యోగి, కిమ్‌ జుంగ్‌ సూక్‌ల సమక్షంలో గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డు ప్రతినిధి సరయూ నది తీరంలో యూపీ ప్రజలు నెలకొల్పిన రికార్డు గురించి వెల్లడించారు.

క్రీస్తు శకం 48నాటి ప్రేమకథ..
అయోధ్య దీపావళి వేడుకకు ప్రత్యేక అతిథిగా కిమ్‌ జుంగ్‌ సూక్‌ రావడం వెనుక పూర్వకాలం నాటి ఓ ప్రేమకథ ఉందట. ఆనాటి అయోధ్య యువరాణి సూరిరత్న క్రీస్తు శకం 48వ సంవత్సరంలో కొరియా వెళ్లి అక్కడి యువరాజు కిమ్‌ సురోను వివాహామాడారని అయోధ్య ప్రజలు నమ్ముతారు. కొరియా యువరాజును పరిణయమాడిన తర్వాత సూరిరత్న పేరును హియో హ్వాంగ్‌ ఓక్‌గా మార్చారట. ఈ దంపతులు దక్షిణ కొరియాలోని గిమ్‌హాలో కరక్‌ వంశాన్ని స్థాపించి సుపరిపాలన అందించారని సంగూక్‌ యూసా అనే కొరియన్‌ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు పాలనలో తనదైన ముద్రవేసిన కారణంగా సూరిరత్న జన్మస్థానమైన అయోధ్య పేరు మీద ‘ఆయుథ’ అనే రాజ్యాన్ని కూడా నెలకొల్పారని తెలుస్తోంది.

కాగా దక్షిణ కొరియాలోని గిమ్‌హా పరిసర ప్రాంతాల్లో సూరిరత్న స్మారక చిహ్నాలు అనేకం దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఆమెకు తగిన గుర్తింపు లభించాలని భావించిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. సూరిరత్న స్మారక చిహ్నం నిర్మించాలని కోరగా యూపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడాలనే ఉద్దేశంతో హియో హ్వాంగ్‌ ఓక్‌ పేరు మీద అయెధ్యలో సూరిరత్న స్మారకాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. సుమారు 300-400 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు ఖర్చును ఇరుదేశాలు సమంగా పంచుకున్నాయి. ఇన్ని ప్రత్యేక కారణాలు ఉన్న కారణంగానే రాణి సూరిరత్న స్మారక సందర్శనతో సూక్‌ తన అయెధ్య పర్యటనను ప్రారంభించారు. అంతేకాదు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి స్మారక సుందరీకరణ పనులకు భూమి పూజ కూడా చేశారు. కాగా తమ ఆడపడుచు అత్తింటి బంధువుకు రాముడు, సీత వేషం వేసుకున్న కళాకారులు సరయూ నది ఒడ్డున ప్రత్యేక ఆహ్వానం పలికారు.

కొరియా రాణి హియో హ్వాంగ్‌ ఓక్‌ (సూరిరత్న )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top