మానవ ప్రాణాలపై కాకి లెక్కలేమిటీ?

kerala political killings - Sakshi

సాక్షి, తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో కొనసాగుతున్న హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘జనరక్ష యాత్ర’లో మొన్న పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ, రాష్ట్రంలో కమ్యూనిస్టుల హత్యా రాజకీయాలకు బీజేపీ, ఆరెస్సెస్‌కు చెందిన కార్యకర్తలు 120 మంది మరణించారని ఆరోపించారు. ఒక్క కన్నూర్‌ జిల్లాలోనే 84 మంది హత్యలకు గురయ్యారని, వాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ మరుసటి రోజు అదే యాత్రలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ 283 మంది బీజేపీ కార్యకర్తలను కమ్యూనిస్టులు చంపారని ఆరోపించారు. ఇద్దరు కూడా ఈ హత్యలు ఎప్పటి నుంచి అంటే ఎంత కాల వ్యవధిలో జరిగాయో తెలపలేదు. ఇద్దరు చెబుతున్న లెక్కల మధ్య ఎలాంటి పొంతన, సమీప్యత కూడా లేదు. 

రాష్ట్రంలో హత్యారాజకీయాలకు వాస్తవంగా బీజేపీ–ఆరెస్సెస్‌ కార్యకర్తలకన్నా వామపక్షాల కార్యకర్తలే ఎక్కువగా మరణించారని ఆరోపిస్తూ సీపీఎం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2000 సంవత్సరం నుంచి 2017 మధ్య సీఎం కార్యకర్తలు 85 మంది హత్యకు గురికాగా, ఇదే కాలంలో బీజేపీ, ఆరెస్సెస్‌లకు చెందిన 65 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆ నివేదిక తెలిపింది. సమాచార హక్కు కింద కన్నూర్‌ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మీడియా సేకరించిన లెక్కల ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2016 సంవత్సరాల మధ్య మొత్తం 65 మంది రాజకీయ కార్యకర్తలు హత్యలకు గురికాగా, వారిలో 31 మంది బీజేపీ, ఆరెస్సెస్‌లకు చెందినవారు కాగా, 30 మంది సీపీఎంకు చెందిన వారున్నారు. గతేడాది నుంచి బీజేపీ, ఆరెస్సెస్‌కు చెందిన వారు నలుగురు హత్యకుగురికాగా, సీపీఎంకు చెందిన కార్యకర్తలు నలుగురు హత్యకు గురయ్యారు. 

అసలు ఎంత మంది తమ కార్యకర్తలు చనిపోయారో బీజేపీకి తెలియదని, అది చేసే ప్రచారమంతా అబద్ధమని 2014లో సీపీఎంలో చేరిని మాజీ బీజేపీ కన్నూరు జిల్లా అధ్యక్షుడు ఓకే వాసు తెలిపారు. కేరళను రాజకీయ హత్యలకు నిలయంగా మార్చాలనే దురుద్దేశంతోనే బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని వాసు విమర్శించారు. 1967 నుంచి 2017 వరకు కన్నూర్‌లో 59 మంది సంఘ్‌ పరివార్‌కు చెందిన కార్యకర్తలు మరణించారని, వారిలో 8 మంది బాంబులు తయారు చేస్తుండగా, సంభవించిన ప్రమాదాల్లో మరణించగా, ఇద్దర కార్యకర్తలు నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ చేతుల్లో హత్యకు గురయ్యారని చెప్పారు. ఈ హత్యా రాజకీయాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేస్తే వాస్తవాలు వాటంతట అవే వెలుగులోకి వస్తాయని చెప్పారు. 

1967 నుంచి కేరళలలో, ముఖ్యంగా కన్నూరు జిల్లాల సీపీఎం, బీజేపీ–ఆరెస్సెస్, కాంగ్రెస్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్, జనతాదళ్, నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రంట్‌ పార్టీల మధ్య ఘర్షణలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమి ఈ హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా–సీపీం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ జనరక్ష యాత్రను చేపట్టారు. ఈ నెల 17న ముగియనున్న ఈ యాత్రకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్‌ నాయకత్వం విహిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా కేరళ హత్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టగా, సీపీఎం కార్యకర్తలు అడ్డుతగలడంతో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top