సోనియాతో కేసీఆర్ భేటీ

సోనియాతో కేసీఆర్ భేటీ - Sakshi


కుటుంబసభ్యులతో పాటు సమావేశం

 రాజకీయాంశాలేమీ లేవని వ్యాఖ్య

 నేడు రాష్ట్రపతితో భేటీ, 26న హైదరాబాద్‌కు

 ఏడు అంశాలతో సోనియాకు నివేదిక

 లక్ష మందితో అమర వీరుల స్థూపం వరకు ర్యాలీ

 త్యాగాలకే తప్ప కృతజ్ఞతకు పనికిరామా?

 అధినేత తీరుపై టీఆర్‌ఎస్ నేతల కినుక


 

 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్:

 ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కుటుం బసమేతంగా కలిశారు. ఆదివారం మధ్యాహ్నం 10, జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో పాటు 12 మంది కుటుంబ సభ్యులు ఆయన వెంట వెళ్లారు. కేసీఆర్ సతీమణి కె.శోభ, మేనల్లుడు టి.హరీశ్‌రావు, ఆయన భార్య శ్రీనిత, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కేసీఆర్ కూతురు కవిత, ఆమె భర్త డి.ఆర్.అనిల్‌కుమార్, మనవళ్లు డి.ఆదిత్య, కె.హిమాంశు, డి.ఆర్య, మనవరాలు కె.అలేఖ్యతో పాటు టీ న్యూస్ ఎండీ, కేసీఆర్ మరదలి కుమారుడు జె.సంతోష్‌కుమార్ సోనియాను కలిశారు. కేసీఆర్ వీరిని సోనియాకు పరిచయం చేశారు. భేటీ 10 నిమిషాల్లోపే ముగిసింది. కేసీఆర్ బృందం మొదట సోనియాకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ‘మా ఆకాంక్ష నెరవేర్చారు. మీకు కృతజ్ఞులం. తెలంగాణ ప్రజలు మీకు రుణపడి ఉంటారు’ అని కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులంతా సోనియాతో అన్నట్టు సమాచారం. బదులుగా సోనియా ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారని తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కేసీఆర్ కలవనున్నారు.

 

 దిగ్విజయ్‌తో టచ్‌లో ఉండాలన్నారు: కేసీఆర్


 సోనియా నివాసం నుంచి బయటికొచ్చాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కృతజ్ఞతలు చెప్పేందుకే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చానన్నారు. ‘‘తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కొన్ని అంశాలతో సోనియాకు ఒక నోట్ ఇచ్చాను. అందుకామె సానుకూలంగా స్పందించారు. రాజకీయాంశాలు ఏమీ మాట్లాడలేదు. మరోమారు పిలిచే అవకాశం ఉండొచ్చని సోనియా అన్నారు. ఎప్పుడు పిలిచినా వచ్చి కలుస్తానన్నా. మరో రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటానని, రాష్ట్రపతిని, ప్రధానిని కలవాల్సి ఉంటుందని చెప్పా. మిగతా విషయాలకు సంబంధించి ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో టచ్‌లో ఉండాలని సోనియా చెప్పారు’ అని వివరించారు.

 

 నేడు, రేపు మరికొందరు పెద్దలతో


 ప్రత్యేక తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటులో సహకరించిన ప్రధాని మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు నేతలను కేసీఆర్ మంగళవారం కలువనున్నారు. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్ కోరారని తెలిసింది. రాష్ట్రపతి, ప్రధాని తదితరులను పార్టీ నేతలతో పాటు వెళ్లి కలుస్తారని వెల్లడించాయి. కేసీఆర్ ఈ నెల 26న తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపానికి లక్ష మందితో ర్యాలీగా వెళ్తారని టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని ప్రకటించి వెళ్లిన కేసీఆర్, మాట నిలబెట్టుకుని వస్తున్నందున ఘనస్వాగతం పలుకుతామన్నారు.

 

 కేసీఆర్ ఇచ్చిన నివేదికలోని అంశాలు..


  ప్రస్తుతం ఏపీ కేడర్‌లో పని చేస్తున్న అఖిల భారత అధికారుల్లో తెలంగాణ నుంచి కేవలం 27 మంది ఐఏఎస్‌లు, 10 మంది ఐపీఎస్‌లు, 15 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులున్నారు. నిజానికి తెలంగాణలో 50 మంది ఐఏఎస్‌లు, 35 మంది ఐపీఎస్‌లు, 35 ఐఎఫ్‌ఎస్‌ల అవసరముంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న తెలంగాణకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులు ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై తెలంగాణలో పని చేసేలా అనుమతించాలి

  ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి

  తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కల్పించాలి

  సెంట్రల్ పూల్ నుంచి ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కనీసం మూడేళ్ల పాటు 500 మెగావాట్ల అదనపు విద్యుత్ కేటాయించాలి

  తెలంగాణలో ఎయిమ్స్ ఆస్పత్రి నెలకొల్పాలి

  తెలంగాణలో ఐఐఎంను ఏర్పాటు చేయాలి

  శంకర్‌పల్లి, నేదునూరు విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్యాస్ కేటాయింపులు జరపాలి

 

 కృతజ్ఞతలకు మేం పనికిరామా?


 సోనియా వద్దకు కేసీఆర్ కేవలం తన కుటుంబీకులను మాత్రమే తీసుకెళ్లడాన్ని టీఆర్‌ఎస్ ముఖ్యులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఆయన తన కుటుంబీకుల ప్రయోజనాలనే తప్ప పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్‌తో విలీనమా, పొత్తా అన్నదానిపై తీవ్ర అయోమయం నెలకొని ఉన్న ఈ దశలో ఇలా వ్యవహరించడం ఏమిటంటూ తప్పుబడుతున్నారు. ‘‘పార్టీ కోసం, ఉద్యమంకోసం 13 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేసినం. క్లిష్ట సమయాల్లో నిద్ర, తిండి లేకుండా కేసీఆర్‌ను ఆయన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా కాపాడుకున్నం. రాజకీయ ఫలాలందే సమయంలో మాత్రం ఆయనకు అంతా కుటుంబ సభ్యులే అవసరమయ్యారు. మేం త్యాగాలకే పనికొస్తాం తప్ప, ఫలితాలు అనుభవించే సమయంలో పనికిరామా?’’ అని ఉద్యమ ప్రస్థానంలో 13 ఏళ్లపాటు కేసీఆర్ వెంట ఉన్న నాయకుడొకరు ఆవేదన వెలిబుచ్చారు. అన్ని క్లిష్ట సమయాల్లోనూ కేసీఆర్‌కు అత్యంత విధేయులుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయిని నర్సింహారెడ్డి, బి.వినోద్‌కుమార్, జి.జగదీశ్‌రెడ్డి వంటి కొందరినైనా సోనియా వద్దకు తీసుకెళ్తే బాగుండేదని టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ కుటుంబసభ్యుల ప్రమేయంపై విమర్శల దాడి పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 విలీనం దిశగా... దిగ్విజయ్ సింగ్‌తో చర్చలు


 కాంగ్రెస్‌తో పొత్తు దిశగానే టీఆర్‌ఎస్ అడుగులు వేస్తున్నట్టు కన్పిస్తోంది. సోమవారం సోనియాతో కేసీఆర్ భేటీ అనంతరం ఈ విషయమై మరింత స్పష్టత వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దిగ్విజయ్‌తో టచ్‌లో ఉండాలన్న సోనియా సూచన మేరకు టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావుతో కలసి ఆదివారం రాత్రి ఆయనతో కేసీఆర్ గంట సేపు భేటీ అయ్యారు. సోనియాకు చెప్పిన విషయాలనే దిగ్విజయ్‌తోనూ ప్రస్తావించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య నియోజకవర్గాల వారీగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పంపకం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 90 శాతం విలీనానికే అవకాశముందని ఇరు పార్టీల నుంచి విన్పిస్తోంది. సోమ, మంగళవారాల్లో కూడా దిగ్విజయ్‌తో కేసీఆర్ సమావేశమవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. విలీనంపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల్లో పరస్పర విరుద్ధ వాదనలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తుకే పరిమితమైతేనే మేలని టీర్‌ఎస్ శ్రేణులంటున్నాయి. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘‘కేసీఆర్ నమ్మదగ్గ రాజకీయ మిత్రుడు కాదు. పొత్తు పెట్టుకుంటే, తీరా ఎన్నికలయ్యాక ఆయన ప్రత్యర్థి కూటమితో చేతులు కలిపే అవకాశాన్ని అస్సలు కాదనలేం. పైగా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు కూడా ఆయన వెనకాడకపోవచ్చు. గతంలో ఎన్నికల పొత్తు పెట్టుకున్న పార్టీల అభ్యర్థులపై సొంత పార్టీ నేతలను బీ ఫారాలిచ్చి మరీ బరిలో దించిన చరిత్ర కేసీఆర్‌ది’’ అంటూ కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top