కర్ణాటక రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేలకు రాజభోగాలు..

Karnataka MLAs Luxury Life In Resorts - Sakshi

అత్యాధునిక హంగు ఆర్భాటాలు. కావలసినంత విశ్రాంతి, వినోదం. చిటికేస్తే దేశ విదేశీ వంటకాలు. ఈత కేంద్రాలు, మసాజ్‌ సెంటర్లు.. అబ్బో రాజ భోగాలే. రాష్ట్ర రాజకీయ సంక్షోభం పుణ్యమా అని అన్ని పార్టీలు ఎమ్మెల్యేలను జారిపోకుండా రిసార్టులకు తరలించాయి. అక్కడ లభిస్తున్న సౌకర్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. అయితే ఖర్చు తక్కువేం కాదు. ఒక్కో ఎమ్మెల్యేకు రోజుకయ్యే బిల్లు ఒక సాధారణ ఉద్యోగి నెలజీతం కంటే ఎక్కువే.   

సాక్షి, బెంగళూరు : సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికీ అన్ని పార్టీలూ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నాయి.  తన ఎమ్మెల్యేలను భద్రం చేసుకోవడానికి బీజేపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాషాయ ఎమ్మెల్యేలు మూడురోజుల నుంచి రిసార్ట్‌లో ఉంటున్నారు. ఈ మూడు రోజుల ఖర్చు 1.15 కోట్ల రూపాయలని తేలింది. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు 33 మంది నగర శివార్లలోని రిసార్టులో మకాం వేశారు. వారి ఖర్చు రూ.2 కోట్లను దాటినట్లు అంచనా. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కోట్లు కుమ్మరించాల్సి
వస్తోందని పార్టీల్లో ఆవేదన నెలకొంది.  

రోజుకు రూ.30 వేలు  
మూడు రోజుల నుండి బీజేపీ ఎమ్మెల్యేలు రాజనకుంట సమీపంలోని రిసార్ట్‌లో 73 మంది, మరో రిసార్ట్‌లో 20 మంది ఎమ్మెల్యేలు రెండుచోట్ల ఉంటున్నారు. రిసార్ట్‌లో రోజుకు ఒక్కొక్కరికి రూ.30 వేలు ఖర్చు అవుతుంది. టిఫిన్, భోజనం, ఇతర అవసరాలకు అదనంగా చార్జ్‌ వేస్తారు. రోజూ బీజేపీ ఎమ్మెల్యేలకు రూ. 35 నుండి 40 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. మూడురోజులకు అందరిపై రూ.1.15 కోట్లు ఖర్చు అయినట్లు తెలిసింది. తమ తమ రిసార్టుల్లో  బీజేపీ జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఉదయమే వాకింగ్, జాకింగ్‌ చేస్తున్నారు. అందరూ ఒక చోటకు చేరి ఉల్లాసంగా కాలం గడుపుతున్నా రు. మూడు పార్టీల ఎమ్మెల్యేలు మూడు రోజులు, మూడు ప్లాన్లు అన్న చందంగా రాజకీయలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రిసార్టుకు వెళ్దామనుకున్నా ఎక్కడ రిసార్ట్‌ దొరకలేదు. దీంతో యశవంతపుర సమీపంలోని గోరగుంటపాళ్య ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో హస్తం ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఇక్కడ రోజుకు ఒక్కొక్కరికి ఖర్చు రూ.15 వేలకు పైగా ఉంటుందని సమాచారం. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజుల నుండి దేవనహళ్లి సమీపంలోని ప్రెస్టీజ్‌ రిసార్ట్‌లో ఉంటున్నారు. గట్టి పోలీసు భద్రతను కల్పించారు.  

కాంగ్రెస్‌లో బుజ్జగింపులు  
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాను బుధవారం బలపరీక్షకు సిద్ధమవుతానని చెప్పడంతో అప్పటిలోగా అసంతృప్త ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకే మంత్రి ఎంటీబీ నాగరాజు ఇంటికి మంత్రి డీకే శివకుమార్, పరమేశ్వరలు చేరుకుని ఆయనను బుజ్జగించారు. మరోవైపు మాజీ హోం మంత్రి రామలింగారెడ్డిని కూడా కాంగ్రెస్‌ నేతలు సంప్రదించారు. తనను కూడా కలుస్తారని భావించిన చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే కె.సుధాకర్‌ ముంబయ్‌కి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ నేతలను బుజ్జగించేందుకు మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ శనివారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top