దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం

Kargil victory was symbol of Indias might - Sakshi

సైన్యం ఆధునీకరణ అత్యంత అవసరం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్‌ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్‌ రంగాలకు మారిపోయిందన్నారు.

కార్గిల్‌ విజయం అందరికీ స్ఫూర్తి
‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్‌ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్‌నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్‌ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్‌ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top