అపార్టుమెంట్లకు నో; కర్ణాటక కీలక నిర్ణయం!

KA DCM Says A Temporary Ban On Apartment Constructions In Bangalore - Sakshi

నిర్మాణంపై బెంగళూరులో ఐదేళ్ల నిషేధం

తీవ్రమైన నీటి కొరతే కారణం

డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ ప్రకటన  

చెన్నై మహానగరంలో మంచినీటి కోసం మహాయుద్ధాలే జరుగుతున్నాయి. ముంబై, ఢిల్లీ నగరాల్లోనూ నీటికి కటకట. ఇక ఉద్యాననగరి బెంగళూరులోనూ పరిస్థితి విషమిస్తోంది. చెరువులు, భూగర్భజలాలు కలుషితమై, సకాలంలో వర్షాలు లేక, నదుల నుంచి నీరు అందక మెట్రో సిటీలో మంచినీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో సంకీర్ణ సర్కారు అపార్టుమెంట్ల నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

సాక్షి, బెంగళూరు :  రాజధాని నగరంలో అపార్టుమెంట్ల నిర్మాణాలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, నగరాభివృద్ధి శాఖ మంత్రి జి.పరమేశ్వర్‌ తెలిపారు. గురువారం ఉదయం ఆయన సదాశివనగరలోని బీడీఏ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో తాగునీటి కొరత విపరీతంగా ఉందన్నారు. ఫలితంగా అపార్టుమెంట్ల కట్టడాలు కొన్నేళ్లు ఆపేయాలని సూచించారు. బెంగళూరుకు కావేరి జలాలు నిత్యం 700 ఎంఎల్‌డీ వస్తున్నా కొరత తీరడం లేదని చెప్పారు. శరావతి, లింగనమక్కి నుంచి నగరానికి జలాల్ని తెప్పించాలని తాను సిఫార్సు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. మేకెదాటు పూర్తయితే బెంగళూరుకు అదనంగా మరో 10 టీఎంసీల నీరు లభిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఇవన్నీ కార్యరూపం దాల్చే వరకు నగరంలో ఎలాంటి అపార్టుమెంట్లకు అనుమతులు ఇచ్చేది లేదని సంబంధిత అధికారులతో చర్చించి తీర్మానించినట్లు తెలిపారు.   

3వేల ఫ్లాట్లకు వసతులున్నాయా?  
నగరంలోని చాలా చోట్ల ఒక్కో అపార్టుమెంటులో సుమారు 3 వేల ఫ్లాట్లు నిర్మిస్తున్నారని డీసీఎ చెబుతూ.. ఆ మేరకు మూడు వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ సామర్థ్యం ఉండాలి, ఆ భవనంలో అంతమందికి నీటి సౌకర్యం కల్పించాలని గుర్తుచేశారు. మురుగు నీరు వెళ్లేందుకు సౌకర్యం ఉండాలి, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఇబ్బందికరం కాబట్టి అపార్టుమెంట్ల కట్టడాలను ఐదేళ్లు నిషేధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ తెలిపారు.  

ఉక్కు బ్రిడ్జి బదులు సిమెంటు వంతెన  
నగరంలో ఎస్టీమ్‌ మాల్‌ నుంచి చాళుక్క సర్కిల్‌ వరకు నిర్మించాలని ప్రతిపాదించిన స్టీల్‌ వంతెన బదులు సిమెంటు, కాంక్రీటుతో వంతెన కట్టాలని నిర్ణయించినట్లు పరమేశ్వర్‌ తెలిపారు. 2015లో అప్పటి సీఎం సిద్ధరామయ్య స్టీల్‌ బ్రిడ్జి ప్రతిపాదనను రద్దు చేశారని చెప్పారు. తరువాత కోర్టు ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు స్టీలు బదులు సిమెంటు కాంక్రీటు వినియోగించి వంతెన పూర్తి చేసేలా తీర్మానించామన్నారు. ఎస్టీమ్‌ మాల్‌ నుంచి చాళుక్క సర్కిల్‌ వరకు ఉపరితల వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో కాలుష్యం నియంత్రించేందుకు త్వరలోనే ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top