అవినీతిలో భారత్‌ టాప్‌

అవినీతిలో భారత్‌ టాప్‌ - Sakshi


ఆసియా–పసిఫిక్‌ దేశాల్లో నంబర్‌వన్ ...

♦ ట్రాన్స పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ సర్వేలో వెల్లడి

♦ లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పిన 69 శాతం భారతీయులు

♦  భారత్‌లో అగ్రస్థానంలో పోలీసుల అవినీతి




బెర్లిన్/న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతి రాజ్యమేలుతుందని తాజా సర్వే ఒకటి తేల్చిచెప్పింది. అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో మన దేశం మొదటిస్థానంలో ఉందని ట్రాన్స పరెన్సీ  ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే భారత్‌లో 41 శాతం అవినీతి పెరిగిందని వెల్లడించింది. ఇక ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచం చెల్లించాల్సి వస్తోందని సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారు. భారత్‌లో పోలీసులు, ప్రభుత్వాధికారులతో పాటు మతపెద్దల్లోనూ  అవినీతి ఎక్కువేనని అధిక శాతం మంది తేల్చిచెప్పారు.


పోలీసులు లంచం తీసుకుంటున్నారని సర్వేలో పాల్గొన్న 85 శాతం భారతీయులు అభిప్రాయపడగా...  తర్వాతి స్థానాల్లో ప్రభుత్వాధికారులు(84 శాతం), బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (79 శాతం), స్థానిక కౌన్సిలర్లు (78), ఎంపీలు (76), పన్ను అధికారులు (74), మత పెద్దలు (71 శాతం) నిలిచారు. సర్వే మేరకు భారత్‌లోని దాదాపు 69 శాతం మంది లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పగా... 65శాతంతో వియత్నాం తర్వాతి స్థానంలో నిలిచింది. చైనాలో 26శాతం, పాక్‌ లో 40శాతం మంది లంచం చెల్లిస్తున్నామన్నారు.


జపాన్  0.2 శాతంతో అవినీతిలో చిట్టచివరన నిలవగా, దక్షిణ కొరియా 3 శాతంతో మెరుగైన స్థానంలో ఉంది. ఆసియాపసిఫిక్‌ లో 16 దేశాల్లో 22 వేల మందిని ప్రశ్నించామని... ఆ లెక్కన గత ఏడాది కాలంలో  ఒక్కసారైనా లంచం చెల్లించినవారు దాదాపు 90 కోట్ల మంది ఉండొచ్చని పేర్కొంది. పోలీసు లు, జడ్జీలు లేదా కోర్టు సిబ్బంది, టీచర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందికి లంచం లేదా బహుమతి లేదా ఉపకారం చేస్తున్నారో అన్న అంశాలపై సర్వే చేశారు.



నిజాయితీ మతనాయకులు 14 శాతమే

ఈ సర్వేలో భారత్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. భారత్‌లో మతనాయకులు అవినీతికి అతీతులు కారని తేల్చింది. మత నాయకుల్లో కొందరు లేదా ఎక్కువమంది లేదా అందరూ అవినీతిపరులంటూ 71 శాతం మంది అభిప్రాయపడ్డారు.


మత నాయకుల్లో కొందరే అవినీతిపరులని 37 శాతం, ఎక్కువ మంది అని 23 శాతం, అందరూ అవినీతిపరులేనని 11 శాతం అభిప్రాయపడ్డారు. మతనాయకులు ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదని 14 శాతం మంది చెప్పగా... 15 శాతం మంది ఏ సమాధానం ఇవ్వలేదు.  ఆసియా పసిఫిక్‌ మొత్తంగా చూస్తే మతనాయకులు అత్యధిక అవినీతి పరులంటూ ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది అభిప్రాయపడడం గమనార్హం.



పెరుగుదలలో చైనా ఫస్ట్‌

అవినీతి పెరుగుదలలో చైనా 73 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే భారత్‌లో 41 శాతం అవినీతి పెరిగి ఏడో స్థానంలో ఉంది. పోలీసు విభాగం లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు ఆసియా పసిఫిక్‌ ప్రజలు ఆరోపించారు. తాము లంచం చెల్లించాల్సి వస్తోందని 38 శాతం పేదలు పేర్కొనగా... ఇతర ఆదాయ వర్గాలతో పోల్చితే వీరిదే అధిక శాతం కావడం గమనార్హం.



పోలీసులు టాప్‌

భారత్‌లో లంచం తీసుకుంటున్న వారి జాబితాలో మాత్రం పోలీసులదే తొలిస్థానం. పోలీసులు లంచం డిమాండ్‌చేస్తారని 85 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటారని 84 శాతం మంది చెప్పారు.


ఆ తర్వాతి స్థానాల్లో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 79 శాతం, స్థానిక కౌన్సిలర్లు 78 శాతం, ఎంపీలు 76 శాతంలో నిలిచారు. ఇక పన్ను అధికారులు 74 శాతంతో ఆరో స్థానంలో ఉండగా మతనాయకులు 71 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు. జడ్జీలు, మేజిస్ట్రేట్‌లు అవినీతిపరులని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు.



లంచం తీసుకోని వారు తక్కువే..

ప్రభుత్వాధికారులు అవినీతికి పాల్పడరని 6 శాతం మంది చెప్పారు. పోలీసులు లంచం తీసుకోరని 7 శాతం, స్థానిక కౌన్సిలర్లు అవినీతికి పాల్పడరని 9 శాతం భారతీయులు చెప్పారు.


ఇక  ఉన్నతస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతిచేయరని 26 శాతం, జడ్జీలు, మేజిస్ట్రేట్‌లు అవినీతిరహితులని 19 శాతం భారతీయులు వెల్లడించారు. ఎంపీల విషయానికి కొస్తే అది 12 శాతమే.



కఠిన చర్యలు చేపట్టాలి

ప్రభుత్వాలు అవినీతిపై మాటలు ఆపి, చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ సేవలు పొందేందుకు బలవంతంగా ప్రజలు లంచం ఇచ్చేలా చేస్తున్నారని, పేదల్ని ఇబ్బంది పెడుతున్నారని సంస్థ చైర్మన్  జోస్‌ ఉగాజ్‌ అభిప్రాయపడ్డారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అవినీతి సమాచారం వెల్లడించేవారికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.


చట్టపరంగా సరైన నిరోధక వ్యవస్థ లేకపోతే అవినీతి అవిచ్ఛిన్నంగా సాగుతుందని, అది చిన్న నేరం కాదని, మన బతుకుదెరువుకు నష్టం కల్గించడంతో పాటు, విద్యను అడ్డుకోవడం, వైద్య సేవల్ని ఆటంకపర్చడంతో పాటు చివరకు మనల్ని చంపేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top