ఇదేమి వైపరీత్యం!

India Floods Kill Dozens, Leave 54,000 Homeless - Sakshi

విపత్తుకు వాతావరణ మార్పులే కారణమా?

1950–2017కాలంలో భారత్‌ను ముంచెత్తిన వరదలు 285. బాధితులు 85 కోట్ల మంది. ఇళ్ళు కోల్పోయినవారు 1.9 కోట్ల మంది. మృత్యువు కబళించింది 71,000 మందిని. ఇలా కేరళే కాదు దేశమంతా ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి తీవ్రమైన వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుతుపవనాల విస్తరణతో ఇటీవలి కాలంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. కేరళలో ప్రారంభమయ్యే రుతుపవనాలు గతంలో పశ్చిమతీరం వెంబడి గుజరాత్‌దాకా విస్తరించి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభావం చూపేవి. కానీ కొన్నేళ్లుగా రుతుపవనాలు గుజరాత్‌ వరకూ ప్రయాణించడం తగ్గిపోయింది. బదులుగా మధ్యభారతంతో పాటు ఈశాన్యభారతంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.

పుణేలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రొపికల్‌ మెట్రాలజీ (ఐఐటిఎం)సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. 4 నెలల రుతుపవనాల కాలంలో విడతల వారీగా కురవాల్సిన వర్షం తక్కువ సమయంలో ఎక్కువగా కురుస్తోంది. దీంతో వర్షపాతం సాధారణ స్థాయిలో కనిపిస్తున్నా చాలా ప్రాంతాల్లో కరువు, కొన్ని చోట్ల అకాల వరద ముప్పు ఉంటోంది.‘ అలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో నివసించడం, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా డ్రైనేజ్‌ వ్యవస్థ దెబ్బతినడం, భూమిలో ఇంకిపోయే శక్తికి మించి వర్షాలు పడడం కారణంగా కాలువలు, సరస్సులు, నదుల్లోకి త్వరగా నీరు చేరుతోంది. దీంతో అప్పటికప్పుడు అనూహ్యంగా ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి’ అని  తాజా అధ్యయనం పేర్కొంది.  

12 శాతం భూభాగానికి వరదల ముప్పు..
ఒక్క 2017లోనే మనదేశంలో వరదల కారణంగా 800 మృతి చెందినట్లు వాతావరణ పరిస్థితులపై అమెరికాలోని నేషనల్‌ ఓషియానిక్, అట్మోస్ఫియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ‘‘తీవ్రమైన వాతావరణ పరిస్థితులే విశ్వవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. జనాభా రీత్యా, భౌగోళిక పరిస్థితుల రీత్యా భారతదేశంలో ఇది మరింత తీవ్ర పరిస్థితులకు దారితీస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే బలమైన విధానాల రూపొందించుకోవాలి’’ అని ఢిల్లీలోని క్లైమేట్‌ చేంజ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ , సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ వ్యవస్థాపకులు, ప్రస్తుత సలహాదారు అయిన మాలతీ గోయల్‌ అభిప్రాయపడ్డారు. దేశంలోని మొత్తం భూభాగంలో 12 శాతం అంటే 4 కోట్ల హెక్టార్ల భూమికి వరద ముప్పు ఉందని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ) తేల్చి చెప్పింది. కుండపోత వర్షాల వల్ల 2014లో కాశ్మీర్‌లోని చినాబ్, జీలంల నదీ ప్రాంతాల్లో 400 గ్రామాలు మునిగిపోయాయి. 2015లో చెన్నై, 2017లో ముంబై, గుజరాత్‌లు భారీ వర్షాల కారణంగా కుదేలయ్యాయి. ఇవే చేదు    అనుభవాలు పునరావృతం కాకుండా సరైన        ప్రణాళికలు రూపొందించుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top