ముంబైని ముంచెత్తిన వరద

IMD warned of more Heavy To Very Heavy Falls In Mumbai - Sakshi

ముంబై : దేశ ఆర్థిక, వినోద రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోతతో మహానగరంలో జనజీవనం స్ధంభించింది. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలకు అనుగుణంగా ఆదివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తడంతో రోడ్డు, రైలు రవాణాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. విమాన రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. నగరంలోని శాంతాక్రజ్‌, నగ్పడ, సియోన్‌ ప్రాంతాలతో పాటు థానే, పాల్ఘర్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలతో స్కూళ్లు, విద్యా సంస్ధలకు సెలవు ప్రకటించారు.

వరద నీరు పట్టాలపైకి చేరడంతో హార్బర్‌ లైన్‌, అంబర్‌నాథ్‌, బద్లాపూర్‌ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ముంబై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారిమళ్లించామని, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇక వరద సహాయక చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం బీఎంసీతో కలిసి పనిచేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top