కృష్ణుడలా.. నేనిలా..!

కృష్ణుడలా.. నేనిలా..! - Sakshi


యూపీ ప్రచారంలో కృష్ణుడితో పోల్చుకున్న మోదీ

ఉత్తరప్రదేశ్‌ దత్తపుత్రుడిని.. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను

బీజేపీకి మెజారిటీ ఇవ్వండని ప్రజలకు పిలుపు  


హర్దోయ్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను కృష్ణ భగవానుడితో పోల్చుకున్నారు. కృష్ణ భగవానుడిలానే తనకూ గుజరాత్, యూపీలతో విడదీయలేని సంబంధం ఉందన్నారు. ‘కృష్ణ భగవానుడు ఉత్తర ప్రదేశ్‌లో జన్మించాడు. గుజరాత్‌ను కర్మభూమిగా మార్చుకున్నాడు. అలాగే నేను గుజరాత్‌లో పుట్టాను. ఉత్తరప్రదేశ్‌ నన్ను దత్తత తీసుకుంది. వారణాసి నుంచి పోటీ చేశాను. ఉత్తరప్రదేశ్‌ నా అమ్మానాన్న వంటిది. తల్లిదండ్రులను విస్మరించే కొడుకును కాదు నేను.



మీరు నన్ను దత్తత తీసుకున్నారు. మీకోసం కృషి చేయాల్సిన బాధ్యత నాది’ అని భావోద్వేగంతో అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ యూపీకి తాను ‘దత్త పుత్రుడిని’ అని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) కాంగ్రెస్‌ పార్టీలను వదిలించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని.. అభివృద్ధిలో వెనకబడి పోతుందని అన్నారు.



ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లను ఓడించండి

‘బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చేట్టుగా ఓట్లేసి గెలిపించండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ వచ్చే ఐదేళ్లలో పరిష్కారం చూపుతానని హామీ ఇస్తున్నాను. ఇది గంగ, యమున నదులతో అలరారే నేల. కోట్లాదిమంది కృషితో సారవంతమైన  భూమి ఇది. అయినా ఇంకా పేదరికం ఉంది. ఎందుకిలా? ఇక్కడ వనరుల కొరత లేదు. ఇక్కడి ప్రజల్లో వెనుకబాటుతనం లేదు. వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. అయితే ఇక్కడి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే అసలు సమస్య. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. అవన్నీ తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే కృషి చేస్తున్నాయి. వాటిని తరిమి కొట్టేంతవరకు యూపీలో మార్పు రాదు’ అని మోదీ అన్నారు.



కేంద్ర పథకాలను అమలు చేయని రాష్ట్రం

సమాజ్‌వాదీ ప్రభుత్వం పలు కేంద్ర ప్రథకాలను రాష్ట్రంలో అమలు చేయలేదని మోదీ ఆరోపించారు. యూపీలో కేవలం 14 శాతం రైతులే పంట బీమా పథకం ప్రయోజనం పొందారన్నారు. ‘చేసిన పనే చెబుతుంది’ అంటున్న వారు బీమా విషయా న్ని రైతులకు చెప్పలేదంటూ పరోక్షంగా అఖిలేశ్‌ను విమర్శించారు. ఇక్కడి పోలీస్‌ స్టేషన్లన్నీ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయా లుగా మారిపోయాయని.. ఆ పార్టీ కార్యకర్తలే ఏ కేసు నమోదు చేయాలి.. వేటిని చేయకూ డదు అనేది నిర్ణయించే పరిస్థితి నెలకొంద న్నారు.


అందుకే రాష్ట్రంలో అధికంగా రాజకీ య హత్యలు, సామూహిక అత్యాచారాలు చోటుచేసుకున్నాయని అన్నారు. దళితులపై వేధింపులు దేశంలో 20 శాతం ఇక్కడే చోటుచేసుకుంటున్నాయని.. అయినా ఎవరికీ శిక్షలు పడలేదన్నారు. చౌదరి చరణ్‌సింగ్‌ ప్రభుత్వం తర్వాత తమ హయాంలోనే ఎరువుల ధరలు తగ్గాయని గుర్తుచేశారు.



కొడుకు ఏం చేయలేదు..దత్త పుత్రుడు అన్నీ చేస్తాడు

బారాబంకిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీల పట్ల ఏహ్యభావం ఏర్పడిందన్నారు. ‘అఖిలేశ్‌జీ.. ఐదేళ్ల కిందట మీరు పాలనా పగ్గాలు చేపట్టినపుడు ప్రజలు మిమ్మల్ని స్వాగతించారు. మీరు యువకులు కాబట్టి రాష్ట్రానికి ఏదైనా చేస్తారని భావించారు.


ఇప్పుడు మీకు ఖాళీ లేదు కాబట్టి మార్చి 11 తర్వాతైన మీకు వ్యతిరేకంగా ప్రజల్లో ఇంతలా ఏహ్యభావం ఎందుకు ఏర్పడిందో ఆలోచించుకోండి’అని మోదీ అఖిలేశ్‌కు హితవు పలికారు. ‘యూపీ కొడుకు (అఖిలేశ్‌) ఏమీ చేయలేక పోయాడు. మీ దత్త పుత్రుడు (మోదీ) మాత్రం మీకోసం అన్నీ చేస్తాడు. పేదల దురవస్థ గురించి నేను పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదు. అదంతా నా బుర్రలోనే ఉంటుంది’అని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top