రాహుల్‌ కోసం చక్రం తిప్పిన సోనియా గాంధీ

How Sonia Gandhi worked for Rahul Gandhi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన భారత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాజయం ఎదురవడంతో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పరిణతి లేని రాహుల్‌ నాయకత్వం వల్లనే పార్టీకి ఇంతటి పరాభవం ఎదురైందని, పార్టీ నాయకత్వ బాధ్యతలను సంపూర్ణంగా ఆమెనే స్వీకరించాలని కూడా పార్టీ నాయకులు సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చారు. రాహుల్‌ గాంధీకి నాయకత్వం బాధ్యతలు పూర్తిగా అప్పగించినట్లయితే పార్టీ సీనియర్‌ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతాయని, పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు కూడా పెరుగుతాయని హెచ్చరికల లాంటి ప్రచారం ఇంటా బయట జరిగింది.
 
కాంగ్రెస్‌ పార్టీకి సుదీర్ఘకాలం పాటు అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ నిర్వహించడమే కాకుండా 2004, 2009లలో జరిగిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కూటమిని విజయ పథాన నడిపించినందున ఆమె నాయకత్వం పట్ల పార్టీలో విశ్వాసం బలపడింది. రాజకీయ రంగంలోనే స్థిరపడాలని వచ్చిన రాహుల్‌ గాంధీకి అనువైన సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని చూస్తున్న ఆమెకు పార్టీలో రాహుల్‌ నాయకత్వం పట్ల ఉన్న అభిప్రాయం అడ్డంకిగా తయారైంది. పార్టీలో అంతర్గత అసమ్మతికి అవకాశం లేకుండా తన నుంచి తన తనయుడికి నాయకత్వ బాధ్యతలను మార్చాలని భావించారు. అందుకని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
 
ముందుగా 2015లోనే పార్టీ బాధ్యతలు అప్పగించాలని సోనియాగాంధీ భావించారు. అప్పటికీ పరిస్థితి అనుకూలించకపోవడంతో తనకు 70 ఏళ్లు వచ్చాక అంటే, గత డిసెంబర్‌ నెలలో పూర్తి బాధ్యతలు రాహుల్‌కు ఇవ్వాలనుకున్నా సమయం కలసిరాలేదు. అనారోగ్యం కారణంగా పార్టీ క్రియాశీలక నాయకత్వం నుంచి తప్పుకుంటున్నానని ఆమె ముందుగా ప్రకటించారు. అది అర్ధ సత్యమేనన్నది అందరికి తెల్సిందే. రాహుల్‌ గాంధీకి నాయకత్వం అప్పగించే వ్యూహంలో భాగంగానే ఆమె క్రియాశీలక నాయకత్వానికి దూరం అవుతూ వచ్చారు. తాను నిర్వహించాల్సిన బాధ్యతలను రాహుల్‌కు అప్పగిస్తూ వచ్చారు. 

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సారూప్య పార్టీలను ఏకం చేయడానికి ముందుగా సోనియా గాంధీయే చొరవ తీసుకొని చర్చలు జరిపినప్పటికీ రానురాను చర్యల బాధ్యతలను కూడా రాహుల్‌ గాంధీకే అప్పగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ కూడా రాహుల్‌ గాంధీతో కలిసి బహిరంగ వేదికలను పంచుకోవాల్సి వచ్చింది. పార్టీలో అంతర్గత నియామకాలను కూడా రాహుల్‌కు అప్పగించారు. ఇలాంటి నియామకాలను రాహుల్‌ గాంధీ ఆమోదించారంటూ పార్టీ కూడా ప్రకటనలు చేయడం మొదలు పెట్టింది. 

రాహుల్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించే క్రమంలో సోనియా గాంధీ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించడం కూడా తగ్గించారు. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఆమె పార్టీ కార్యకర్తలను అసలు కలుసుకోలేదు. ఎన్నికల ప్రచారం మినహా గత నాలుగు నెలలుగా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చారు. రాహుల్‌ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు ముహూర్తం ఖరారయినప్పటికీ పార్టీ సీనియర్‌ నేతల్లో అసంతృప్తి వెల్లువెత్తలేదంటే సోనియా వ్యూహం పూర్తిగా ఫలించినట్లే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top