ఆ ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్

ఆ ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ - Sakshi


హస్తినలో మీడియాతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 

 సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నన్ను తప్ప మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ ప్రలోభ పెట్టారు. చంద్రబాబుతో సహా తెలుగుదేశం సీనియర్ నేతలంతా ప్రయత్నించినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే ఆకర్షించగలిగారు. మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్ చెబుతున్నా.. ఎంతగా ప్రలోభ పెట్టినా.. అబద్దాలు చెప్పి మోసం చేసే ముఖ్యమంత్రి వైపు వెళ్లకుండా ప్రజల పక్షాన నిలబడినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నా..’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.



మంగళవారం సాయంత్రం పార్టీ ఎంపీలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు నాయుడి దారి దొడ్డిదారి.. ఆయన జీవితమంతా అదేతీరున పనిచేస్తుంటారు...’ అని జగన్ విమర్శించారు. దొడ్డిదారిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారని అన్నారు. ‘‘చంద్రబాబు ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెడుతూ.. కోట్ల డబ్బు, మంత్రి పదవులు ఎరచూపి, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తీరు చూసి సిగ్గుపడాలి. ఆయన చేసిన పని నిజంగా బాధ అనిపించింది. బాగా దగ్గరగా ఉన్న మనుషులను, కుటుంబం అని అనుకుంటున్న వారిని ప్రలోభ పెట్టి మంత్రి పదవులు ఆశచూపి తీసుకెళ్లడం బాధనిపించింది. మరీ ముఖ్యంగా నాగిరెడ్డన్న విషయంలో... ఎందుకంటే శోభమ్మ చనిపోయినప్పుడు నేను, అమ్మ, నా భార్య, సోదరి షర్మిల అందరం వెళ్లాం... అంతగా కుటుంబసభ్యులుగా భావించాం. అటువంటి వ్యక్తిని కూడా మంత్రి పదవి ఎరచూపించి తీసుకునే సరికి బాధనిపించింది.’’ అని జగన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...



 గుండెలపై చెయ్యేసుకోవాలి..

 పోయిన ఎమ్మెల్యేలు గుండెలపై చేతులు వేసుకుని మనస్సాక్షిని అడగాలి. రేపు పొద్దున ప్రజలు కూడా అడుగుతారు. చంద్రబాబు పూర్తిగా భేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. వాటిని పక్కనపెట్టి రైతులను అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. రుణ మాఫీకి  రెండు దఫాల్లో ఇచ్చింది రూ. 7,300 కోట్లు మాత్రమే. మొత్తం రూ. 87,612 కోట్ల రుణాలకు గాను ఈ 22 నెలల్లో వడ్డీనే దాదాపు రూ. 24 వేల కోట్లు అయ్యింది.. రుణమాఫీ పేరుతో ఆయన ఇచ్చింది కనీసం వడ్డీలో మూడో వంతు కూడా లేదు. ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని ప్రకటనలు ఇచ్చి మోసం చేశారు. అటువంటిబాబును నిలదీయకుండా.. ప్రశ్నించకుండా ఆయన పార్టీలోకి వెళ్లడం ధర్మమేనా అని ప్రజలు అడిగితే పోయిన నలుగురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. డ్వాక్రా అక్కచెల్లెళ్ల్లకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామన్నారు.



వడ్డీ లేని రుణాలు కట్టుకునే పరిస్థితుల్లో ఉన్న డ్వాక్రా మహిళలు బాబు కట్టొద్దని అన్నందుకు.. కట్టకపోవడంతో రుణాలు మాఫీ అవడం మాట అటుంచి ఇవ్వాళ రెండు రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిలదీయాల్సింది పోయి చంద్రబాబు పక్షాన నిలవడం ఎంతవరకు ధర్మమని ఆ అక్కచెల్లెళ్లు అడిగితే వీళ్లు ఏం సమాధానం చెబుతారు?  ఇంటికో ఉద్యోగం అన్నాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. జాబు ఇవ్వలేకపోతే రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఒక్కరికి కూడా ఉద్యోగమిచ్చిందే లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారా అని కోటి 75 లక్షల ఇళ్లు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ పిల్లలు రేపు పొద్దున ఈ నలుగురు ఎమ్మెల్యేలను అడిగితే ఏం సమాధానం చెబుతారు? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానన్నాడు. గుడిసే లేని ఆంధ్రరాష్ట్రాన్ని చేస్తానన్నాడు. ఈ పెద్దమనిషి ఒక్క ఊళ్లో రెండు ఇళ్లు కూడా ఇవ్వలేదు. రేపొద్దున ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? ప్రజల కోసం నిలబడకుండా డబ్బు కోసం, పదవుల కోసం వెళ్లిపోతే ఎలా అని ప్రజలు అడిగితే ఎలా అని వారి మనస్సాక్షిని అడగాలి..



 బాబు జీవితం దొడ్డిదారిన లాక్కోవడమే..

 దొడ్డిదారిన ఎమ్మెల్యేలను లాక్కోవడానికే చంద్రబాబు తన జీవితకాలమంతా గడిపారు. ఎన్టీ రామారావు చలవ వల్ల గెలిచిన ఎమ్మెల్యేలను దొడ్డిదారిన లాక్కుని, ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆయన జీవితమంతా అదే. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, గీతను దొడ్డిదారిన లాక్కున్నాడు. వాళ్లపై అనర్హత వేటు పడకుండా తన పలుకుబడితో ఆపుకుంటున్నాడు. ఈ వేళ నలుగురు ఎమ్మెల్యేలను దొడ్డిదారిన లాక్కున్నాడు. నాకు, చంద్రబాబుకు తేడా ఉంది. నేను అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు ప్రతిపక్షమే. మేం ఎవరినైనా తీసుకోవాలనుకుంటే వాళ్లు రాజీనామా చేసిన తరువాత ప్రజల ఆశీస్సులతో మళ్లీ గెలిపించుకునేవాళ్లం. కానీ చంద్రబాబు అలాకాదు. ఏది చేసినా దొడ్డిదారిన చేస్తారు. ఇంత కష్టపడితే, ఇ న్ని ప్రలోభాలు పెడితే, ఇంత అనుకూల మీడియాతో అబద్దాలు చెబుతూ, మళ్లీ దాన్ని వక్రీకరిస్తూ.. చేసిన తప్పును చేయలేదన్నట్టుగా భ్రాంతి కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.



 ఆ పార్టీ ఎమ్మెల్యేలే క్యూ కడతారు..

 ఇది రెండో సంవత్సరం కాబట్టి మా పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను బాబు తీసుకోగలిగాడు. మూడో ఏడాది దాటితే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడతారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏస్థాయిలో ఉంటుందంటే చంద్రబాబు  గ్రామాల్లోకి వెళితే ప్రజలు కొట్టే పరిస్థితి ఉంటుంది. తెలుసుకో చంద్రబాబూ.. నువు ఇవాళ చేస్తున్నదానికి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు గతంలో మీ పార్టీలో చేరిన ఇద్దరు ఎంపీలపై తప్పని సరిగా అనర్హత వేటు పడుతుంది. ఉప ఎన్నికలొస్తాయి. దాన్ని మీరు ఆపలేరు. మీ ప్రభుత్వం ఉన్నా.. పోలీసు యంత్రాంగం ఉన్నా..  రిగ్గింగ్ వంటి వాటితో గెలవాలని చూసినా పై నుంచి దేవుడు చూస్తాడు.. ప్రజలు చూస్తున్నారు. వారు మొట్టికాయలు వేస్తే గూబ ఏరకంగా గుయ్యిమంటుందో తెలిసివస్తుంది.

 

 నిస్సిగ్గుగా వక్రీకరణ

 
జగన్ 21 మంది ఎమ్మెల్యేలతో ఈ ప్రభుత్వాన్ని పడగొడతానన్నాడు కాబట్టి నేను లాక్కుంటున్నానని నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. అసలు నేనన్నది ఏమిటి? దయచేసి చానళ్లు ఆ టేపులను ఒక్కసారి ప్రసారం చేయాలి. గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చి మీడియాతో నేనన్నదేమంటే... ‘‘హరీష్‌ను చూసి బుద్ది తెచ్చుకోండి. కేటీఆర్‌ను చూసి బుద్ది తెచ్చుకోండి. వాళ్లు ఏరకంగా ఎమ్మెల్యేలను లాగుతున్నారో తెలుసుకోండి. నేర్చుకోండని చంద్రబాబు కేబినెట్ మీటింగుల్లో చెబుతున్నారు. బాబుకి సిగ్గుందా’’ అని నేను ఆ రోజు అడిగా. ఆ మాటంటూ నాతో కూడా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కూడా అన్నా. మరి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 21 మంది మీ వద్ద ఉన్నారా? అని ఒక విలేకరి అడిగితే నేనన్నా.. ‘లేరు తల్లీ.. ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్యలో ఎమ్మెల్యేలు నాదగ్గర లేరు.. ఆ నెంబరు నా దగ్గర ఉన్నప్పుడు కచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది. కచ్చితంగా ఓ గంట ముందు నీకు కూడా చెబుతా తల్లీ...’ అన్నా. చంద్రబాబు ఆర్నెల్లుగా నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకు నా మాటలను వక్రీకరిస్తున్నారు. బాబు కన్నా అన్యాయస్తుడు దేశంలో ఎవరూ ఉండరు. చేయాలనుకున్నది ధైర్యంగా చేయాలని ఆయనకు చెబుతున్నా.. నిన్ను నమ్మేవారెవరూ లేరు. బాబు పార్టీ మునిగిపోయే పడవ అని అందరికీ తెలుసు. గ్రామాల్లో ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మోసం చేశారని, అబద్దాలు చెప్పారని చంద్రబాబును తిడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top