మోగిన గుజరాత్‌ నగారా

Gujarat Assembly Polls In 2 Phases, Says Election Commission - Sakshi

డిసెంబర్‌ 9, 14న రెండు విడతల్లో ఎన్నికలు

18న కౌంటింగ్‌..అమల్లోకొచ్చిన ఎన్నికల కోడ్‌

ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కయ్యే ప్రశ్నేలేదు: సీఈసీ ఏకే జోతి  

న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌తో పాటుగానే డిసెంబర్‌ 18న గుజరాత్‌ ఎన్నికలకు కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు సీఈసీ ఏకే జోతి బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో గుజరాత్‌లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. నవంబర్‌ 14న తొలిదశకు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడగానే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఆ రోజునుంచే నామినేషన్లు ప్రారంభమవుతాయి’ అని ఏకే జోతి స్పష్టం చేశారు. 182 సీట్లున్న గుజరాత్‌ అసెంబ్లీలో తొలిదశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
పారదర్శకత, శాంతియుతంగా ఎన్నికలు
రాష్ట్రంలోని 50,128 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు ధ్రువీకరణ పత్రాల (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక పూర్తిస్థాయి మహిళా పోలింగ్‌ కేంద్రాన్ని ఈసారి ఏర్పాటుచేయనున్నట్లు సీఈసీ వెల్లడించారు. కోడ్‌ అమల్లోకి రావటంతో లైసెన్స్‌డ్‌ ఆయుధాలున్న వారంతా పోలీస్‌ స్టేషన్లలో వాటిని డిపాజిట్‌ చేయాలని ఆయన కోరారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు జోతి వెల్లడించారు. ‘గుజరాత్‌లో నేటివరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఈసారి కూడా శాంతియుతంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. ఇందుకోసం రాష్ట్ర పోలీసులతోపాటుగా కేంద్ర బలగాలనూ మోహరించనున్నాం’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కైందన్న ఆరోపణలను ఏకే జోతి ఖండించారు. ‘ప్రభుత్వంతో మేం కుమ్మక్కై పనిచేసే ప్రశ్నే లేదు. గుజరాత్‌ ఎన్నికల షెడ్యూలు ఆలస్యానికి కారణాలను స్పష్టంగా తెలియజేశాం.

మా నిర్ణయంలో ఎలాంటి పొరపాటూ లేదు. ఈ ఆలస్యంపై మాజీ సీఈసీలు, ఇతర అధికారులు చేసిన వ్యాఖ్యలపై నేనేమీ చెప్పలేను. పరిస్థితిని బట్టే నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. 2016లో తమిళనాడులో వరదలు,  పాఠశాలలు, కాలేజీలకు పరీక్షల కారణంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించటం ఆలస్యమైన సంగతిని జోతి గుర్తుచేశారు. 2012లో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లకు ఒకేసారి ఎన్నికల ప్రకటన వెలువడినా వేర్వేరు షెడ్యూల్స్‌ ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని.. ఈ రెండు రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు వేర్వేరనే విషయాన్ని గమనించాలన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటుగా గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. వరదల బాధితులకు సహాయ కార్యక్రమాల కోసం సమయం ఇవ్వాలని గుజరాత్‌ ప్రధాన కార్యదర్శి.. ఈసీని కోరటంతో ఈ షెడ్యూల్‌ ఆలస్యమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top