టెలికం, బ్యాంకింగ్‌ ప్రియం

టెలికం, బ్యాంకింగ్‌ ప్రియం


సేవలపై పన్ను రేట్లు ఆమోదించిన జీఎస్టీ మండలి

- విద్య, వైద్యం మినహాయింపు.. టెలికంపై 18 %.. పెరగనున్న ఫోను బిల్లు

- ఎకానమీ విమాన ప్రయాణం, ఏసీ రైలు ప్రయాణం మరింత చవక

- నాన్‌ ఏసీ హోటల్స్‌పై 12, ఏసీ హోటల్స్‌ 18 శాతం..
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో భాగంగా ఇప్పటికే వస్తువులపై పన్ను రేట్లను నిర్ణయించిన జీఎస్టీ మండలి.. శుక్రవారం సేవలపై పన్ను రేట్లను ఖరారు చేసింది. విద్య, వైద్యం వంటి సేవల్ని పన్ను పరిధి నుంచి పూర్తిగా మినహాయించగా.. మిగతా సేవల్ని 5, 12, 18, 28 పన్ను శ్లాబుల్లోకి చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జూలై 1  నుంచి టెలికం, బ్యాంకింగ్, బీమా సేవలు ప్రియం కానున్నాయి. బంగారంపై రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. శ్రీనగర్‌లో నిర్వహించిన జీఎస్టీ మండలి రెండ్రోజుల భేటీ ముగింపు రోజైన శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ.. ‘అన్ని సేవల్ని 5, 12, 18, 28 పన్ను శ్లాబుల్లోకి చేర్చాం. రవాణ సేవలపై(రైల్వేలు, విమాన ప్రయాణం) 5 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.ప్రస్తుతం కొనసాగుతున్న మినహాయింపు జాబితాకు కొత్తగా వేటినీ చేర్చలేదని, సేవల పనితీరు ఆధారంగా వాటిని వివిధ పన్ను శ్లాబుల్లో చేర్చామని జైట్లీ పేర్కొన్నారు. అన్ని సేవల్ని 5, 12, 18, 28 పన్ను శ్లాబుల్లో చేర్చామని అయితే ఎక్కువ సేవల్ని 18 శాతం పరిధిలో ఉంచినట్లు తెలిపారు.  ప్రస్తుతం ఏవైతే మినహాయింపు జాబితాలో ఉన్నాయో అవి అలాగే కొనసాగుతాయని, జీఎస్టీతో మరింత సమర్ధంగా పన్ను వ్యవస్థ అమలవడమే కాకుండా వినియోగదారుడి అనుకూలమని పేర్కొన్నారు. బంగారం, ఇతర ఖరీదైన లోహాలపై జూన్‌ 3న ఢిల్లీలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జైట్లీ పేర్కొన్నారు. శుక్రవారం మరిన్ని వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్ల వివరాల్ని వెల్లడించారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే.ఏఏ సేవలపై ఎంత పన్ను..

► రవాణా రంగం(రైల్వేలు, విమాన ప్రయాణం)పై 5 శాతం జీఎస్టీ.. వీటి ప్రధాన ఇంధనమైన పెట్రోలియంను ఇంకా జీఎస్టీ పరిధిలోకి తేనందున 5 శాతం శ్లాబులో చేర్చినట్లు జైట్లీ తెలిపారు.

► విమాన ప్రయాణంలో ఎకానమీ క్లాస్‌పై 5 శాతం, బిజినెస్‌ క్లాస్‌పై 12 శాతం పన్ను వసూలు. ఏసీ రైలు ప్రయాణంపై 5 శాతం పన్ను.

► నాన్‌ ఏసీ హోటల్స్‌పై 12 శాతం

► ఏసీ హోటల్స్, మద్యం సరఫరా చేసే ఏసీ హోటల్స్‌పై 18 శాతం ఏడాదికి రూ. 50 లక్షలు, అంతకంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న రెస్టారెంట్లపై 5 శాతం జీఎస్టీ

► హోటల్స్, లాడ్జిల్లో  రోజువారీ టారిఫ్‌ రూ. 1000 కంటే తక్కువ ఉంటే పన్ను ఉండదు. రూ.2500–5000 మధ్య టారిఫ్‌కు 18 శాతం,

► విలాసవంతమైన, ఐదు నక్షత్రాల హోటల్స్‌పై 28 శాతం

► రేస్‌ క్లబ్బుల్లో బెట్టింగ్‌లు, సినిమాలపై 28 శాతం(ప్రస్తుతం సినిమాలపై చాలా రాష్ట్రాల్లో 40–45 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను తగ్గించడం వల్ల సినిమా టికెట్ల ధరలు తగ్గే అవకాశముంది)

► టెలికంపై 18 శాతం(ప్రస్తుతం ఫోన్‌ బిల్లు చెల్లింపులపై 15 శాతం వసూలు), ఆర్థిక సేవలపై(బ్యాంకింగ్, బీమా) 18 శాతం(ప్రస్తుతం వీటిపై 15 శాతం పన్ను వసూలు చేస్తున్నారు)

► ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు(ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ వంటివి) సప్లయిర్స్‌కు నగదు చెల్లించకముందే 1 శాతం పన్ను ముందుగానే వసూలు చేయాలి.

► క్యాబ్‌ అగ్రిగేటర్స్‌(ఒలా, ఉబేర్‌) సేవలపై 5 శాతం.. ప్రస్తుతం 6 శాతం పన్ను చెల్లిస్తున్నాయి.

► వర్క్‌ కాంట్రాక్టులపై 12 శాతం

► వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం స్థలాన్ని అమ్మితే 5 శాతం పన్ను (ప్రస్తుతం ఎలాంటి పన్ను వసూలు చేయడం లేదు)ధరలు పెంచితే కఠిన చర్యలు: జైట్లీ

జూలై 1 నుంచి జీఎస్టీ బిల్లు అమలును సాకుగా చూపి ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హెచ్చరించారు. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి రాగానే.. వస్తువుల్ని అధిక ధరలకు విక్రయించడాన్ని అడ్డుకునేందుకు ‘యాంటీ–ప్రాఫిటీరింగ్‌ ఏజెన్సీ’ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కంపెనీల చిట్టాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, జీఎస్టీ లబ్ధిని కంపెనీలు దుర్వినియోగం చేశాయా? లేక వినియోగదారులకు బదిలీ చేశాయా అన్న అంశాలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు.28 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి

చూయింగ్‌ గమ్స్, వైట్‌ చాకొలెట్స్, చాకొలెట్స్, కోకో చాకొలెట్స్, వేఫర్‌ చాకొలెట్స్, ఇన్‌స్టంట్‌ కాఫీ, కస్టర్డ్‌ పౌడర్, విద్యార్థులు వాడే రంగులు, పెయింట్స్, వార్నిష్‌లు, పెరŠూప్యమ్స్‌ , సౌందర్య ఉత్పత్తులు, సన్‌స్క్రీన్స్, షాంపూలు, హెయిర్‌ డైలు, షేవింగ్‌ లోషన్స్, డియోడరంట్స్, బాణాసంచా, వాష్‌ బేసిన్స్, కృత్రిమ ఫర్‌ ఉత్పత్తులు, కృత్రిమ పువ్వులు, విగ్గులు, రేజర్‌ బ్లేడ్‌లు, వంటకు వాడే కత్తులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్టోరేజ్‌ వాటర్‌ హీటర్స్, ఫొటోకాపీ యంత్రాలు, ఫ్యాక్స్‌ యంత్రాలు, ఇన్సులేటెడ్‌ కాపర్‌ తీగ, వాచీలు, రివాల్వర్లు, పిస్టల్స్, సిగరెట్‌ లైటర్లు..ఖరారు చేసిన వస్తు సేవల పన్ను రేట్లు

5% టీ, కాఫీ(ఇన్‌స్టంట్‌ కానిది), వేరుశనగ, చేపలు, కిరోసిన్‌ లాంతరు, బయో గ్యాస్‌ ప్లాంట్, పవన విద్యుత్, కేన్‌ షుగర్, బీట్‌ షుగర్, రవాణా సేవలు, రూ.50లక్షల టర్నోవర్‌ గల రెస్టారెంట్లు, ఓలా, ఉబర్‌

12% మొబైల్‌ ఫోన్లు, ఫౌంటేన్‌ పెన్‌ ఇంకు, టూత్‌ పౌడర్, అగరవత్తులు, పాల సీసా, బ్రెయిలీ పేపర్, రంగులేసే పుస్తకాలు, గొడుగులు, పెన్సిల్‌ షార్ప్‌నర్, ట్రాక్టర్లు, సైకిళ్లు, కాంటాక్ట్‌ లెన్సులు, కళ్లద్దాలు, వంటపాత్రలు, క్రీడా సామగ్రి, ఫిషింగ్‌ రాడ్లు, దువ్వెనలు, పెన్సిళ్లు, పెయింటింగ్‌లు, పండ్ల రసాలు, మాంసం, ఏసీ లేని రెస్టారెంట్లు

18% హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్‌లు, అణు రియాక్టర్లు, గడియారాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్‌ బొమ్మలు,ప్లాస్టిక్‌ బటన్లు, వెన్న, జున్ను, కండెన్స్‌డ్‌ మిల్క్, మద్యం లైసెన్సు ఉన్న ఏసీ రెస్టారెంట్లు, టెలికం, ఆర్థిక సేవలు

28% శీతల పానీయాలు, పరిమళ ద్రవ్యాలు, ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్లు, డియోడ్రెంట్స్,ఉన్ని, రేజర్‌ బ్లేడ్లు, కార్లు, రివాల్వర్లు, పిస్టల్స్, బెట్టింగ్, సినిమా హాళ్లుపన్ను రేట్లపై మరిన్ని వివరాలు

► కార్లను 28 శాతం పన్ను రేటులో ఉంచగా.. నాలుగు మీటర్ల పొడవు కంటే తక్కువ ఉండే చిన్నకార్లు, 1200సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌ కెపాసిటీ కార్లపై 1% సెస్సు. చిన్న డీజిల్‌ కార్లు, 1500సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ కార్లపై 3% సెస్సు విధిస్తారు. మధ్యతరహా కార్లు, ఎస్‌యూవీ, ఖరీదైన కార్లపై 15% సెస్సు. 1500సీసీ ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న విలాసవంతమైన కార్లపై 15% సెస్సు.

► నిమ్మరసం, ఎరేటెడ్‌ డ్రింక్స్‌పై 28 శాతం పన్నుతో పాటు 12% సెస్సు, 350సీసీ ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న మోటార్‌సైకిళ్లపై 28 శాతం పన్నుతో పాటు 3% సెస్సు అదనం. ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్, ఖరీదైన పడవలపైనా అదే పన్ను రేటు.

► పొగాకు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్నుతో పాటు 61 నుంచి 204 శాతం వరకూ సెస్సు విధిస్తారు. ఇక పైప్స్, సిగరెట్స్‌ కోసం వాడే పొగాకు పదార్థాలపై 290 శాతం పన్ను. 65ఎంఎం పొడవు మించని ఫిల్టర్, నాన్‌ ఫిల్టర్‌ సిగరెట్లపై 5% సెస్సు, ఒక్కోదానిపై రూ.1.59 అదనం.  65ఎంఎం నుంచి 70 ఎంఎం పొడవు మించని నాన్‌ఫిల్టర్‌ సిగరెట్లపై 5% సెస్సు, రూ.2.87అదనం, ఫిల్టర్‌ సిగరెట్లపై 5% సెస్సు, రూ.2.12 అదనం. బ్రాండెడ్‌ గుట్కాలపై 72% సెస్సు (వీటన్నింటిని 28 శాతం పన్ను జాబితాలో చేర్చారు).

Back to Top