రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

Green signal for road and railway projects - Sakshi

బెంగళూరు–మైసూరు మధ్య  ఎన్‌హెచ్‌–275 విస్తరణకు రూ.2,920 కోట్లు

‘నక్సల్‌’ మల్కన్‌గిరిలో తొలి రైల్వే లైన్‌

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ మంగళవారం పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో బెంగళూరు–మైసూరు మధ్య జాతీయ రహదారి విస్తరణ, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్‌ల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు, ఒడిశాలోని నక్సల్‌ ప్రభావిత మల్కన్‌గిరి జిల్లాలో తొలి రైల్వేలైను నిర్మాణం, చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా ధారసు,  యమునోత్రిల మధ్య సొరంగ నిర్మాణాలు ఉన్నాయి.

4 రాష్ట్రాల్లో రూ.11,661 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బెంగళూరు–మైసూరు మధ్య జాతీయ రహదారి– 275ను 61 కి.మీ. మేర విస్తరణకు రూ. 2,920 కోట్ల ఖర్చుకు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో నిడగట్ట–మైసూరు సెక్షన్‌ మధ్య ఎన్‌హెచ్‌–275ను ఆరు లేన్లుగా విస్తరిస్తారని ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ తెలిపింది.

నాలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రాక్‌ల విద్యుదీకరణ, కొత్త రైల్వే లైన్‌ కోసం రూ. 11,661 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు అమలైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో 2 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.

ఈ నాలుగు రాష్ట్రాల్లో 881 కి.మీ. మేర ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. వీటిలో ఝాన్సీ–మాణిక్‌పూర్, భీమ్‌సేన్‌–ఖైరార్‌ లైన్ల మధ్య 425 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ. 4955.72 కోట్లు ఖర్చు చేస్తారు. ఒడిశాలోని నక్సల్‌ ప్రభావిత జిల్లా మల్కన్‌గిరి నుంచి జయపూర్‌కు రైల్వే లైను నిర్మాణానికి రూ. 2676.11 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

చార్‌ధామ్‌ ప్రాజెక్టులో సొరంగానికి పచ్చజెండా
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిని కలిపే చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా ధారసు– యమునోత్రి మధ్య రూ. 1,384 కోట్లతో సొరంగం నిర్మాణానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ సొరంగం నిర్మాణంతో ఆ రెండు ప్రాంతాల మధ్య 20 కి.మీ. దూరం, గంట ప్రయాణ సమయం తగ్గుతాయి.  

పీఎంఏవైకి అదనంగా రూ. 25 వేల కోట్ల సేకరణ
ప్రధానమంత్రి అవాస్‌ యోజన(అర్బన్‌) పథకం అమలు కోసం అదనపు నిధుల సేకరణకు కేబినెట్‌ అంగీకరించింది. ఈ పథకంలో భాగంగా పట్టణ పేదలకు 1.2 కోట్ల ఇళ్లు నిర్మించాలని పట్టణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 2018–19 బడ్జెట్‌లో పీఎంఏవై(యు) కోసం రూ. 6505 కోట్లు కేటాయించగా.. రూ. 25 వేల కోట్లను ఇతర మార్గాల ద్వారా సేకరిస్తారు. మొత్తమ్మీద నాలుగేళ్ల వ్యవధిలో రూ. 60 వేల కోట్లు సేకరిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top