జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ కీలక ముందడుగు

Governor Adviser to hold open hearing in Srinagar - Sakshi

శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యే యత్నం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌, లధాఖ్‌ విభజన తదితర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అనంతరం​ భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయిన కశ్మీర్‌ లోయలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ఆంక్షలు ఎత్తివేసి..  పాఠశాలలను తెరిచిన సంగతి తెలిసిందే. రోడ్ల మీద జనజీవన సంచారం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ ప్రజలకు చేరువయ్యేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కీలక ముందడుగు వేశారు.

ప్రజలు తమ సమస్యలు నేరుగా ప్రభుత్వ యంత్రాంగానికి విన్నవించుకొనే అవకాశం కల్పించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఒకరోజు ముందు గురువారం గవర్నర్‌ సలహాదారు కేకే శర్మ స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారని, శ్రీనగర్‌లోని గవర్నర్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన నేరుగా ప్రజల సమస్యలు వింటారని, ప్రజలు ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు, ఇబ్బందులు ఉంటే ఈ కార్యక్రమంలో తెలియజేయాలని జమ్మూకశ్మీర్‌ సమాచార శాఖ తెలిపింది. ప్రస్తుతం గవర్నర్‌ తర్వాత అత్యంత కీలకమైన ప్రభుత్వ హోదాలో ఆయన సలహాదారు ఉన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిణామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top