14 వందల ఓట్లకు ఒక కేంద్రం

Future elections every polling station only 1400 can vote - Sakshi

సాక్షి, ఢిల్లీ: సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ వ్యయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) ద్వారా ఓటు వినియోగించుకునే విధానంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఓటు వేసిందీ లేనిదీ నిర్ధారించుకోవడానికి ఓటు వేయగానే ఒక రసీదు పొందే విధంగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈవీఎంలో ఓటు (మీట నొక్కిన తర్వాత) వేయగానే స్వైపింగ్ మిషన్లలో వచ్చినట్టుగానే వీవీపీఏటీ రసీదు వస్తుంది. రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు ఈ విధానాన్ని భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ అమలు చేయాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది.

అయితే, ప్రతి ఈవీఎంకు జోడించిన ఈ విధానం కోసం థర్మల్ పేపర్ రోల్స్ వాడాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒక్కో థర్మల్ పేపర్ రోల్ నుంచి గరిష్టంగా 1500 ఓట్లకు మించి ఓట్లు వినియోగించడానికి వీలులేదు. ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలన జరిపిన తర్వాత తాజాగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ప్రతి పోలింగ్ బూతులో 1400 వందల ఓట్లకు మించి ఓటు వినియోగించుకోవడానికి వీలులేదని తేల్చింది. జరగబోయే అన్ని ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో 1400 వందల మంది ఓటర్లు మాత్రమే ఓటు వినియోగించుకోవాలని, అంతకుమించిన ఓటర్లు ఉన్న పక్షంలో మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆ విధంగా చర్యలు చేపట్టాలని బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించింది.

దేశంలో మొట్టమొదటిసారిగా 2013 లో నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో ఈ ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో  8 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోకవర్గాలు లక్నో, గాంధీనగర్, బెంగళూరు (దక్షిణ), చెన్నై (సెంట్రల్), జాదవ్ పూర్, రాయపూర్, పాట్నా, మిజోరం స్థానాల్లో మరోసారి ఉపయోగించారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రమంతా వీవీపీఏటీ విధానంలోనే ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో అనేక రాజకీయ పార్టీల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఆ తర్వాత నిర్వహించిన అనేక ఉపఎన్నికల్లోనూ ఈ పద్ధతిలోనే ఎన్నికలు జరిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top