ఆధార్‌ నెంబర్‌ తప్పుగా సమర్పిస్తే భారీ ఫైన్‌!

Failure To Enter Aadhaar Number Is A Fine Of Rs 10,000 - Sakshi

న్యూఢిల్లీ : పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ నంబరును ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తే భారీ జరిమానా తప్పదు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పాన్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని, దాని స్థానంలో ఆధార్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆధార్‌ నెంబర్‌ను సమర్పించే సమయంలో తప్పుడు అంకెలు నమోదు చేస్తే రూ.10వేల జరిమానా నిబంధనను వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. అందుకనుగుణంగా సంబంధిత చట్టాల్లో సవరణలు చేసి సెప్టెంబర్ 1 నుంచి జరిమానా నిబంధనను తీసుకురావాలనుకుంటోంది.

ఇప్పటికే ఐటీ చట్టంలోని సెక్షన్ 272బి సవరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి పాన్ కార్డుల స్థానంలో ఆధార్ కార్డులను కూడా ఉపయోగించవచ్చని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుంచి జనాభా డేటాను పొందిన తరువాత ఆదాయపు పన్ను విభాగం వ్యక్తికి ఆధార్ నెంబర్‌ ఆధారంగా పాన్ కేటాయించాలి. ఇప్పటికే తన ఆధార్‌ను తన పాన్‌తో అనుసంధానించిన వ్యక్తి కూడా తన ఎంపిక ప్రకారం పాన్ కార్డుల స్థానంలో ఆధార్‌ను చట్ట ప్రకారం ఉపయోగించవచ్చని’ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. పాన్ నెంబర్‌ కోట్ చేయడం తప్పనిసరి అయిన అన్ని ప్రదేశాల్లో ఆధార్ అంగీకరించడానికి బ్యాంకులు, ఇతర సంస్థలు అందుకు తగినట్లుగా మార్పులు చేయనున్నాయి. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మనదేశంలో 22 కోట్ల పాన్‌కార్డులు, ఆధార్‌తో అనుసంధానించి ఉన్నాయి. 120కోట్ల మందికి పైగా ప్రజలు మన దేశంలో ఆధార్‌కార్డులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆధార్‌ ఉంటే పాన్‌ తప్పనిసరి కాదు. కాబట్టి ఇది ప్రజలకు గొప్ప సౌలభ్యం. ఇక నుంచి బ్యాంకుల్లో కూడా రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన నగదును డిపాజిట్ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఆధార్‌ను ఉపయోగించి నగదు బదిలీలు చేసుకోవచ్చు.’ అని పాండే తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top