రెండాకుల గుర్తుపై ఈసీ ఏమంటోంది?

రెండాకుల గుర్తుపై ఈసీ ఏమంటోంది?


తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో రాజకీయాలు పలురకాల మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనం అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. శశికళ, దినకరన్‌లను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించినట్లు లిఖితపూర్వకంగా చూపించాలని, మరికొన్ని షరతులకు కూడా అంగీకరించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండాకుల గుర్తు కోసమే వీళ్లిద్దరూ కలుస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడా గుర్తు గురించిన వివాదం ఎన్నికల కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉంది.ఇటీవల వాయిదాపడిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల కోసం పన్నీర్ వర్గానికి విద్యుత్ స్తంభం, శశికళ వర్గానికి టోపీ గుర్తులను ఈసీ కేటాయించింది. అయితే ఇప్పుడు అక్కడి రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. శశికళ వర్గం అంటూ ఇక ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో రెండాకుల గుర్తుపై ఎవరేమంటారో చెప్పేందుకు జూన్ 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. రెండు వర్గాలూ తమ వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలు అన్నింటినీ ఆలోగా సమర్పించాలని తెలిపింది. ఇప్పుడు ఎటూ రెండు వర్గాలూ కలిసిపోతున్నాయి కాబట్టి గుర్తు విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావిస్తున్నారు.ఇద్దరూ ఒకే వర్గంగా కలిసిపోయి అప్పుడు ఎన్నికల కమిషన్‌కు ఒకే అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని అంటున్నారు. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి.. ఎటూ ఎన్నికల కమిషన్ కూడా చాలా ఎక్కువ గడువు ఇచ్చినందున ఈలోపు విషయం మొత్తం సర్దుమణుగుతుందని చెబుతున్నారు. చిన్న చిన్న విభేదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని, ఇకమీదట ఒకే అన్నాడీఎంకే ఉంటుందని, రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

Back to Top