28న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌! 

EC Would Release Schedule To General Elections Soon - Sakshi

మార్చి చివరి నుంచి నెలరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు పూర్తి 

2019 సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు 

రాష్ట్ర ఎన్నికల సంఘాల సంసిద్ధత 

పారామిలటరీ బలగాలు రెడీ అన్న కేంద్ర హోంశాఖ 

యూపీ, బిహార్, మహారాష్ట్ర మినహా మిగిలిన చోట్ల ఒకే దశలో.. 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 28న వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ.. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులందరూ సీఈసీకి నివేదికలు సమర్పించారు. ఎన్నికలకు అవసరమైన పారా మిలటరీ బలగాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇటీవలే సీఈసీకి నివేదించింది. క్రితంసారిలాగా కాకుండా ఈసారి 5 దశల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 28న (మంగళవారం) షెడ్యూల్‌ ఖరారు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నాలుగో వారంలో, ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ టూ) పరీక్షలు మార్చి మూడో వారంలో పూర్తి కానున్నాయి. వీటి షెడ్యుల్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో ఏ దశలో ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 

మార్చి చివరి వారంలో మొదటి దశ! 
ఈ నెల 28న షెడ్యూల్‌ విడుదలైతే.. మొదటిదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ మార్చి 3న వెలువడనుంది. మొదటిదశ ఎన్నికలకు మార్చి నాలుగో వారంలో ఎన్నిక జరగనుంది. మొత్తం ఐదు దశల్లో, 55 రోజుల్లో పూర్తి చేసే విధంగా ఈసీ కసరత్తు పూర్తి చేసింది. ఈ లెక్కన ఐదు దశల పోలింగ్‌ ఏప్రిల్‌ చివరి వరకు పూర్తి చేస్తారు. మే మొదటి వారంలో ఓట్ల లెక్కింపు జరిగేలా.. షెడ్యూల్‌ను రూపొందించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా శాసనసభలకు ఎన్నికలు నిర్వహించనున్నది. పశ్చిమబెంగాల్, అస్సాంతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు.

పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌లో నాలుగు దశల్లో, బ బిహార్‌లో మూడు దశల్లో, మహారాష్ట్రలో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ చేపడుతామని ఈసీ ఉన్నతాధికారవర్గాలు వెల్లడించాయి. ‘మే నెలలో ఉత్తరాదిన వేడి గాలులు భయంకరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అందువల్ల ఏప్రిల్‌ చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఓటర్లకు, ఎన్నికల విధుల్లో పాల్గొనే లక్షల మంది సిబ్బందికి ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. ఈ మేరకు ఫిబ్రవరి మూడో వారంలోనే షెడ్యూల్‌ విడుదల చేయాలని భావిస్తున్నాము. కొంత ఆలస్యమైనా ఈ నెలలోనే షెడ్యూల్‌ ప్రకటించే ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నాము’అని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top