‘గాలి’ బూడిదవుతున్న ఊపిరితిత్తులు

Delhi air pollution level today: air quality in 'severe' category, stubble burning still continues - Sakshi

దేశ రాజధానిలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం

పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి నాడు రెండు గంటలకు మించి టపాసులు కాల్చవద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు. దేశ రాజధాని ప్రాంతంలో హరిత టపాసులకు మాత్రమే పరిమితం కావాలని సూచించింది. అయినా ప్రజలు ఉన్నత ధర్మాసనం ఆదేశాలను బేఖాతరు చేశారు. ఇంచుమించు 50 లక్షల కిలోల టపాసులను ఢిల్లీలో కాల్చి పడేశారు. ఇలాంటి ధోరణులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో పర్యావరణ చైతన్యం రేకెత్తించేందుకు ఓ విలక్షణ ప్రయోగం చేశాయి. అదేంటో చూద్దాం...

 గాలి నాణ్యత ఎంత ప్రమాదకరంగా క్షీణించిందో తెలియ చెప్పేందుకు, ప్రజల్లో పర్యావరణ స్పృహ కలిగించేందుకు.. హెల్త్‌ ఢిల్లీ బ్రీత్‌ అనే సంస్థ దేశ రాజధానిలో ఓ విలక్షణ కార్యక్రమం చేపట్టింది. లంగ్‌ కేర్‌ ఫౌండేషన్, గంగారామ్‌ ఆస్పత్రి నిర్వాహకులతో కలసి నవంబర్‌ 3న ఒక పెద్ద ఊపిరితిత్తుల నమూనాను గంగారామ్‌ ఆస్పత్రి ఆవరణలో ఉంచింది. జట్కా.ఆర్గ్‌ అనే బెంగళూరుకు చెందిన ఎన్జీవో దీన్ని తయారు చేసింది. ‘సర్జికల్‌ వస్త్రంతో ఈ నమూనాను రూపొందించాం. శరీరంలోని ఊపిరితిత్తుల్లాగే పనిచేసేందుకు హెపా (హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్‌ ఎయిర్‌) ఫిల్టర్‌ సాయం తీసుకున్నాం.

కాలుష్య తీవ్రత వల్ల 48 గంటల్లో ఊపిరితిత్తుల నమూనా ముదురు బూడిద రంగులోకి మారిపోయింది. ఢిల్లీ ప్రజలు విషాన్ని పీల్చుతున్నారనడానికి ఈ ప్రయోగాన్ని ఒక నిదర్శనంగా చూపుతున్నాం’అని చెస్ట్‌ సర్జన్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. ఈ నమూనా ఏర్పాటు చేసిన ప్రాంతం ఢిల్లీలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే గాలి నాణ్యత పరంగా కాస్త మెరుగైనదని ఆయన పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మాస్కులు, ఎయిర్‌ ఫిల్లర్లు వంటి తాత్కాలిక ఏర్పాట్లున్నా.. జనం తాకిడి ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వాటితో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. వాయు కాలుష్యాన్ని ఆరోగ్య సంక్షోభంతో పోల్చుతున్నారాయన.

జట్కా.ఆర్గ్‌ నిర్వాహకులు వివిధ నగరాల్లో ఇంతకు ముందు చిన్న చిన్న ఊపిరితిత్తుల నమూనాలు ఏర్పాటు చేశారు. ‘వాయి కాలుష్యంతో రంగు మారిపోయిన వాటి ముక్కల్ని పలువురు రాజకీయ వేత్తలకు, వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు పంపారు. అయితే రెండు రాష్ట్రాలు మాత్రమే దీనిపై స్పందించినట్లు ఈ సంస్థకు చెందిన సృష్టికుమార్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top