మరో 31 మంది మృతి 

Coronavirus: Nationwide 31 People Deceased With Corona Virus - Sakshi

దేశంలో ఒక్కరోజులో 1,463 పాజిటివ్‌ కేసులు  

353కు చేరిన మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. లాక్‌డౌన్, హాట్‌స్పాట్లు, స్వీయ నిర్బంధం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య తొలిసారిగా 10 వేల మార్కును దాటేసింది. దీంతో పరిస్థితి చెయ్యి దాటి పోతోందా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు.. గత 24 గంటల్లో కరోనా కాటుకు దేశంలో 31 మంది బలయ్యారు.

కొత్తగా 1,463 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 353కు, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,815కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 9,272 కాగా, 1,190 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు.      రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ దేశవ్యాప్తంగా 602 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ మంగళవారం వెల్లడించారు. ఏదైనా ఒక ప్రాంతంలో గత 28 రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదంటే అక్కడ వైరస్‌ సంక్రమణ చైన్‌  తెగిపోయినట్లేనని ఆరోగ్య శాఖ తెలిపింది.  

మినహాయింపులు ఎవరెవరికి?   
రెండో దశ లాక్‌డౌన్‌లో కొన్ని కీలక రంగాలకు మినహాయింపులు లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. వ్యవసాయం, ఫార్మా, మత్స్య రంగాలకు వెసులుబాట్లు కల్పించే వీలుంది. దేశంలో  కరోనా ప్రభావం అధికంగా ఉన్న 370 జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ఆయా జిల్లాల మధ్య ప్రజల రాకపోకలను అడ్డుకుంటారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాని జిల్లాల్లో దాబాలు, వాహనాల మరమ్మతుల దుకాణాలు, స్థానిక కార్మికులతో నిర్మాణ పనులకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది.

అలాగే వ్యవసాయ కూలీలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) కార్మికుల రాకపోకలకు కొన్ని షరతులతో అనుమతించే అవకాశం ఉంది. మోదీ ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఏయే రంగాలకు, ఎవరెవరికి మినహాయింపులు ఇవ్వాలి అనే దానిపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. భౌతిక దూరాన్ని పాటించాలన్న షరతుతో వ్యవసాయ పనులకు అనుమతి ఇవ్వనున్నట్లు హోంశాఖ అధికారులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top