విషాదవేళలో షూటింగ్‌లా?

Congress has shown its true colours: BJP  - Sakshi

మోదీపై మండిపడ్డ కాంగ్రెస్‌ 

హస్తం పార్టీ అసలు రంగు బయటపడింది: బీజేపీ 

పుల్వామా ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం 

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై విపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 14న 40 మంది జవాన్లు వీర మరణం పొందిన సమయంలో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌     కార్బెట్‌ జాతీయ పార్కులో తాపీగా  ప్రచార చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. దేశంలో కుటుంబాలన్నీ విషాదంలో ఉంటే ఆరోజు సాయంత్రం రాత్రి ఏడు గంటల సమయంలో మోదీ టీ, సమోసాలను ఆస్వాదిస్తూ గడిపారని పేర్కొంది. 

పాక్‌కు గుణపాఠం చెప్పింది కాంగ్రెసే.. 
1947, 1965, 1971 నాటి యుద్ధాల్లో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పింది కాంగ్రెసేనన్న సంగతిని షా మరువొద్దని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా సూచించారు. దేశభక్తి గురించి షా నేర్చుకోవాలని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గురువారం జరిగిన సభలో షా మాట్లాడుతూ..40 మంది వీర జవాన్ల త్యాగాలు వృథాగా పోవని, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్‌ మాదిరిగా భద్రతపై రాజీపడబోమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సుర్జేవాలా స్పందిస్తూ..బంగ్లాదేశ్‌ విముక్తికి ఇందిరా గాంధీ సహకరించారని, 1971లో 91 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత ఆర్మీ ముందు లొంగిపోయారని గుర్తుచేశారు.   

దేశ కార్యకలాపాలు ఆగకూడదనే: బీజేపీ 
కాంగ్రెస్‌ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ..ఓ వైపు భద్రతా బలగాలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెబుతూనే హస్తం పార్టీ తన అసలు రంగును బయటపెట్టుకుందని ఆరోపించింది. ముందస్తుగా నిర్ణయించిన పులుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఆరోజు జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కుకు వెళ్లారని న్యాయ మంత్రి రవిశంకర్‌ వివరణ ఇచ్చారు. ‘పుల్వామా దాడి గురించి కాంగ్రెస్‌కు తెలుసా? మాకైతే తెలియదు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దాడి తరువాత బీజేపీ తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకుందని తెలిపారు. ఉగ్రవాదుల వల్ల దేశ కార్యకలాపాలు నిలిచిపోకూడదనే అలా చేశామని చెప్పారు.

అమరవీరులకు  హోదా ఇవ్వరు కానీ.. 
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఉగ్రదాడిలో మరణించిన 40 మంది జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వరు కానీ.. అనిల్‌ అంబానీకి మాత్రం రూ. 30 వేల కోట్ల ప్రజాధనాన్ని బహుమతిగా ఇస్తారని ఆరోపించారు. పుల్వామా దాడిని రఫేల్‌ ఒప్పందంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ చెప్పే నవభారత్‌ అంటే ఇదే అని ఎద్దేవా చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top