మొగ్గు ఎన్డీయేకే..! 

 Congress BJP vote share is Four Percent - Sakshi

బీజేపీకి 222–232, దాని మిత్ర పక్షాలకు 41–51 సీట్లు 

కాంగ్రెస్‌కు 74–84, దాని మిత్ర పక్షాలకు 41–51 స్థానాలు 

సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కన్నా అధికార ఎన్డీయేకే మెరుగైన అవకాశాలున్నాయని సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి ముందస్తు సర్వేలో తేలింది. ఏడాది వ్యవధిలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించిన ఎన్డీయే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సరళి ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉండబోతున్నా మార్చి చివరి వారం నాటి అంచనాల ప్రకారం బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను గెలవలేకపోయినా, మిత్ర పక్షాలతో కలసి సాధారణ మెజారిటీ మార్కును అందుకుంటుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్, బీజేపీల ఓట్ల వాటా నాలుగు శాతం పెరుగుతుందని, కానీ బీజేపీకి ఆ మేర సీట్ల సంఖ్య పెరగకపోవచ్చని పేర్కొంది.

బీజేపీకి 35 శాతం, దాని మిత్ర పక్షాలకు ఆరు శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 23 శాతం, దాని మిత్ర పక్షాలకు ఏడు శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది. ఇక సీట్ల పరంగా చూస్తే, బీజేపీకి సొంతంగా 222–232, దాని మిత్ర పక్షాలకు 41–51 సీట్లు, కాంగ్రెస్‌కు 74–84, దాని మిత్ర పక్షాలకు 41–51 స్థానాలు దక్కే అవకాశాలున్నాయని వెల్లడించింది. బీఎస్పీ–ఎస్పీ కూటమి 37–47, లెఫ్ట్‌ పార్టీలు 5–15, ఇతరులు 88–98 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది.  ఉత్తర, మధ్య భారత్‌లో 2014లో గెలుచుకున్న సీట్లలో చాలా వాటిని బీజేపీ ఈసారి కోల్పోయే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి బీజేపీకి తీవ్ర పోటీ ఎదురుకానుందని అంచనా వేసింది. ప్రస్తుత సరళే కొనసాగితే యూపీలో బీజేపీ చాలా సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు తెలిపింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌లలో బీజేపీ మంచి పనితీరునే కనబరిచినా, 2014లాగా పూర్తి ఆధిపత్యం చెలాయించకపోవచ్చని తెలుస్తోంది.+

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top