కాంగ్రెస్‌ శ్రేణుల్లో సంబరాలు

Congress Activists Praises Rahul Gandhi - Sakshi

రాహుల్‌ గాంధీ అధినాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్న కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే మెజారిటీని సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎన్నికల ఫలితాల సరళి తెలిసినప్పటినుంచి ఢిల్లీలోని అక్బర్‌రోడ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ జెండాలు పట్టుకుని నృత్యాలు చేస్తూ విజయోత్సవాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయం వెనుక రాహుల్‌ గాంధీ పాత్ర ఎంతో ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రాహుల్‌ గాంధీని గొప్ప నేతగా పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో తదుపరి ప్రధాని రాహుల్‌ గాంధీయేనంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలైన ప్రియాంక చతుర్వేది, నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ పార్టీ కార్యాలయానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ..పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాహుల్‌ గాంధీ గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శించి పార్టీ కి విజయాన్ని సాధించిపెట్టారని కొనియాడారు. అందరం కలిసికట్టుగా కష్టపడటం వల్లే ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధ్యమైందని తెలిపారు. చాలాకాలం తర్వాత కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకోవడం ఇదే తొలిసారి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రదర్శించిన స్ఫూర్తినే వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా చూపించాలని, కాంగ్రెస్‌ విజయం పట్ల చాలా సంతోషంగా ఉందని లా విద్యార్థి జీత్పాల్‌ యాదవ్‌ అన్నారు. ఈ విజయంతో మనం ఆగిపోకూడదని, ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల విజయంతో లోక్‌సభలో గెలుస్తామనే అలసత్వం పనికిరాదన్నారు. రాజకీయ పార్టీలు పేదల సంక్షేమాన్ని పట్టించుకోవాలని, పేదరికాన్ని రూపుమాపేందుకు పార్టీలు ఆలోచించాలన్నారు. ఇదే విషయాన్ని సోనియా, రాహుల్‌ గాంధీలకు చెప్పేందుకు తాను ఇక్కడకు వచ్చినట్లు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుభాష్‌ చంద్ర రాజ్‌భర్‌ తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top