ఒక్కటైన చైనా వధువు- భారత వరుడు!  

Chinese Woman Came To India To Marry Madhya Pradesh Man - Sakshi

కరోనా వ్యాపిస్తున్న వేళ ఒక్కటైన చైనా యువతి- భారత యువకుడు

భోపాల్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ భయాందోళనలు సృష్టిస్తున్న వేళ చైనా యువతి, భారత యువకుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వధువు కుటుంబ సభ్యులే భారత్‌కు విచ్చేసి కన్యాదానం నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. చైనాకు చెందిన జిహావో వాంగ్‌, భారత్‌కు చెందిన సత్యార్థ్‌ మిశ్రా ఐదేళ్ల క్రితం కెనడాలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం వివాహ వేడుక నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ముహూర్తం నిర్ణయించాయి. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి వచ్చే వాళ్ల ఇ- వీసాను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో జిహావో కుటుంబ సభ్యులు భారత్‌కు వచ్చేందుకు అధికారులు తొలుత వీసా నిరాకరించారు. దీంతో వారు మరోసారి అధికారులను సంప్రదించగా.. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే భారత్‌లో ప్రవేశించాలని సూచించారు. ఈ క్రమంలో అన్ని రకాల టెస్టులు ముగిసిన తర్వాత బుధవారం వధువు సహా ఆమె తల్లిదండ్రులు మరో ఇద్దరు మధ్యప్రదేశ్‌ వెళ్లేందుకు అధికారులు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మాందసౌర్‌లో వారి వివాహ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఇక ఈ విషయం గురించి జిహావో తండ్రి షిబో వాంగ్‌ మాట్లాడుతూ..‘మాకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అందుకు మేము ఏమాత్రం ఇబ్బంది పడలేదు. నిజానికి మేము నివాసం ఉండే చోట కరోనా వైరస్‌ వ్యాపించలేదు. అయినప్పటికీ అందరి క్షేమం దృష్ట్యా వైద్యాధికారులకు సహకరించాం. మా కూతురి పెళ్లి జరిగిపోయింది. ఇక మేం తిరిగి చైనాకు వెళ్లిపోతాం’ అని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top