పోలవరం అంచనాల పెంపు.. కేంద్రం కీలక ప్రకటన!

Centre Key Statement on Polavaram Project - Sakshi

పెంచిన అంచనాలపై సంతృప్తికర సమాధానం ఇస్తేనే.. ఆమోదం తెలుపుతాం  

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తేనే.. పెంచిన కొత్త అంచనాలను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. 2010- 11లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ. 16101 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే, రాష్ట్రప్రభుత్వం తాజాగా ఈ అంచనాలను సవరించింది. ఈ సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు తాజా వ్యయం రూ. 58,319 కోట్లు అవుతుందని తెలిపింది.

ఈ అంశాన్ని కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తోందని, పోలవరం సవరించిన అంచనాలపై కమిషన్ కొన్ని వివరణలు కోరిందని కేంద్రం తెలిపింది. భూసేకరణ, పునరావాసం,  కుడి-ఎడమ కాలువల డిజైన్లు మార్పు, హెడ్‌ వర్క్స్‌ పరిమాణం పెంపు తదితర అంశాలపై వాటర్‌ కమిషన్‌ సమాచారాన్ని కోరిందని, ఈ అంశాలపై  రాష్ట్రప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తే.. ఆ మేరకు సవరించిన అంచనాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది.

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజల కోసం రాష్ట్రప్రభుత్వం దశలవారీగా సహాయ పునరావాస కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 1. 66 లక్షల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. వీటిలో 1.10 లక్షల ఎకరాలను సేకరించారు. 98, 480 కుటుంబాలు ఈ ప్రాజెక్టుతో నిర్వాసితులు అవుతున్నారు.  ఇప్పటివరకు 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. డిసెంబర్ 2019 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.  పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ కాంపోనెంట్‌కు మాత్రమే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు అందిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top