కోల్‌కతా మాజీ చీఫ్‌పై లుకౌట్‌ నోటీసు

CBI issues look out notice against Rajeev Kumar - Sakshi

న్యూఢిల్లీ: శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు గట్టి షాక్‌ తగిలింది. రాజీవ్‌ దేశం విడిచి వెళ్లకుండా ఆదివారం ఆయనపై సీబీఐ లుకౌట్‌ నోటీసు జారీ చేసింది. ఈమేరకు అన్ని ఎయిర్‌పోర్టులు, ఇమిగ్రేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రూ.2,500 కోట్ల శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాజీవ్‌కు తప్పనిసరిగా నిర్బంధ విచారణ అవసరం. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు.

ఆయన్ని ప్రశ్నించే సమయంలో అహంకారంతో వ్యవహరిస్తున్నారు’ అని సీబీఐ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజీవ్‌ కుమార్‌ 27వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు ఆయన్ను అరెస్టు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘ఈ కేసులో వేసిన సిట్‌ దర్యాప్తు సంస్థకు రాజీవ్‌ కుమార్‌ అప్పుడు ఇన్‌చార్జిగా ఉన్నారు. కుంభకోణానికి సంబంధించిన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలువురు నేతల కీలక ఆధారాలను బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.  ఆ మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపకుండా ఆధారాలను నాశనం చేశారు’ అని సీబీఐ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top