రాష్ట్రపతి ఎన్నికకు సిద్ధమౌతున్న రంగం

రాష్ట్రపతి ఎన్నికకు సిద్ధమౌతున్న రంగం - Sakshi


భారత 14వ రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమౌతోంది. ఏప్రిల్‌ 9న మూడు లోక్‌సభ, పది రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగి, 15న ఫలితాలు ప్రకటించాక ఈ ఎన్నికలో పాల్గొనే అర్హత ఉన్న ఎలక్టర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ ఖరారు చేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్లు వేసే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మొత్తం 29 రాష్ట్రాలు, అసెంబ్లీలున్న రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, ఢిల్లీ అసెంబ్లీ సభ్యులను కలిపి ఎలెక్టరల్‌ కాలేజీ అని పిలుస్తారు. ఈ ఉప ఎన్నికల తేదీలు మార్చి 9న ప్రకటించాక ఖాళీ అయిన సీట్లకు జూన్‌ 16న లేదా ఒకట్రెండు రోజులు ముందు నోటిఫికేషన్‌ విడుదలయ్యే లోగా ఎన్నికలు నిర్వహించకపోవచ్చు.



ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి లోక్‌సభ, శాసనసభ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాకపోవచ్చని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీల సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఎలెక్టరల్‌ కాలేజీ సభ్యులు 4896.  మొత్తం ఎలెక్టర్ల ఓట్ల విలువ 10,98,882. ఒకవేళ ఎలెక్టర్లందరూ ఓటేస్తే మెజారిటీకి అవసరమైన ఓట్ల విలువ 5,49,442. మార్చి 11న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించాక కేంద్రంలో పాలక కూటమి ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, దాని భాగస్వామ్యపక్షాలకు జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో మెజారిటీకి ఇంకా దాదాపు 20 నుంచి 24 వేల విలువ గల ఎలెక్టర్ల మద్దతు అవసరమని అంచనావేస్తున్నారు. వచ్చే నెల 15న ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించాక ఎలెక్టర్ల(ఓటర్లు) సంఖ్య తేలిపోతుంది.



ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా రాజ్యసభలో బలం బాగా తక్కువ. ఈ సభలో ఎన్డీఏకు 77, యూపీఏకు 84 సభ్యులుండగా, రెండు కూటముల్లో లేని ఏఐఏడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, బిజూజనతాదళ్, వైఎస్సార్పీపీ వంటి దాదాపు పది పార్టీలకు 82 మంది సభ్యులున్నారు. గతంలో ఎన్డీఏ(బీజేపీ తొలి ప్రధాని ఏబీ వాజ్‌పేయి) అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు, ప్రతిపక్షాల్లో కొన్ని పార్టీలు సూచించిన రాజకీయ నేపథ్యం లేని శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ హయాంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షం శివసేన ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థులు భైరవ్‌సింగ్‌ షెకావత్‌(బీజేపీ), పీఏ సంగ్మాకు ఓటేయలేదు. 2007లో మహరాష్ట్రకు చెందిన నాయకురాలనే కారణం చెప్పి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతిభాపాటిల్‌కు, 2012లో మంచి నాయకుడని చెప్పి ప్రణబ్‌ ముఖర్జీకి శివసేన సభ్యులు ఓట్లేశారు. ఈ ఏడాది జులై మూడో వారంలో జరిగే అవకాశమున్న రాష్టపతి ఎన్నికల్లో కూడా శివసే ఎవరికి ఓటేస్తుందో ఇప్పుడే చెప్పలేం.



ఈ పరిస్థితుల్లో రెండు కూటములకు చెందని, దాదాపు రెండు శాతం చొప్పున ఓట్ల(విలువ) బలమున్న బీజేడీ, ఏఐఏడీఎంకే వంటి ప్రతిపక్షాల్లో ఒక పార్టీ మద్దతు ఎన్డీఏ అభ్యర్థి విజయానికి అవసరమని అంచనావేస్తున్నారు. వాజ్‌పేయి హయాంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకు ఇప్పటితో పోల్చితే బాగా తక్కువ బలమున్న కారణంగా సంఘ్‌ పరివార్‌తో, అసలు రాజకీయాలతోనే సంబంధంలేని కలాంను రాష్ట్రపతిని చేశారు. అయితే, లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో (26 సీట్లు తక్కువ) ఉన్న ఎన్డీఏను నడపుతున్న బీజేపీకి సంపూర్ణ మెజారిటీ(281) ఉన్న కారణంగా కాషాయ నేపథ్యం ఉన్న పార్టీ నేతనే దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top