రాష్ట్రపతి ఎన్నికల బరిపై బీజేపీ 'రామ'బాణం

రాష్ట్రపతి ఎన్నికల బరిపై బీజేపీ 'రామ'బాణం


దళిత నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేసి ప్రతిపక్షాలకు సవాల్‌

- బిహార్‌ గవర్నర్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అనూహ్య నిర్ణయం

- ఏకగ్రీవం కోసం సోనియా, మన్మోహన్‌లతో మాట్లాడిన మోదీ

- ప్రాంతీయ పార్టీల అధినేతలకూ ఫోన్లు.. మద్దతు ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు

- బీజేపీ నిర్ణయం ఏక పక్షమని కాంగ్రెస్‌ విమర్శ  


న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠ. ప్రచారంలో ఉన్న జాబితాలో హేమా హేమీలున్నారు. వీరిలో ఒకరిని అదృష్టం వరిస్తుంది. కానీ ఎవరా వ్యక్తి అనేదానిపై సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతున్నంతసేపూ ఎడతెగని ఉత్సుకత నెలకొంది. అనూహ్య నిర్ణయాలతో ప్రత్యర్థుల ఊహకందకుండా వ్యవహరించటంలో దిట్టలైన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాలు మరోసారి యావద్భారతాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పెరుగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరదించుతూ.. బిహార్‌ గవర్నర్, దళితనేత రామ్‌నాథ్‌ కోవింద్‌ (71) పేరును ప్రకటించారు.చివరి వరకూ పలువురు ప్రముఖుల పేర్లతో ప్రచారం.. విదేశాంగశాఖ కార్యాలయం ముందు సుష్మ కోసం మీడియా పడిగాపులు.. మరెన్నో ఊహాగానాలు తప్పని నిరూపించారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం రామ్‌నాథ్‌ పేరును అమిత్‌ షా అధికారికంగా వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థి గెలిచేందుకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు ఉండటంతో పాటు దళిత నేత అయిన కోవింద్‌ పేరును ప్రకటించి విపక్షాలకు సవాల్‌ విసిరారు.రంగంలోకి మోదీ, అమిత్‌ షా


దీంతో రెండోసారి దళితుడు రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించేందుకు.. కాంగ్రెస్‌ సహా విపక్ష, ఎన్డీయే పక్ష నేతలతో మోదీ, అమిత్‌ షా, బీజేపీ కీలక నేతలు మాట్లాడి అవసరైన మద్దతుకు కూడగడుతున్నారు. అనూహ్య నిర్ణయంతో అంతటా విస్మయం నెలకొని ఉండగానే.. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని తెలిపి మోదీ మద్దతు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ తదితర నేతలతో మోదీ, షాలు ఫోన్లో మాట్లాడారు. ఏఐఏడీఎంకే, బీఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలతోనూ బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలనేతలోనూ చర్చలు జరుగుతున్నాయి. శివసేన మాత్రం ఇంతవరకు తన స్పందన వెల్లడించలేదు.ఏకాభిప్రాయంపై షా ఆశాభావం

దళిత సమస్యలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకే కేంద్రం అనూహ్యంగా కోవింద్‌ పేరును తెరపైకి తెచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ దళితనేత రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా రాజ్యాంగంపైనా అవగాహన ఉంది. ‘రామ్‌నాథ్‌ కోవింద్‌ పేద దళిత కుటుంబంలో పుట్టారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు. పేదలు, దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అందుకే కోవింద్‌ ఎంపికపై ఏకాభిప్రాయం వస్తుందని భావిస్తున్నాం’అని విలేకరుల సమావేశంలో అమిత్‌ షా తెలిపారు.పలువురు సభ్యులతో రూపొందించిన జాబితాను పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించారని.. అనంతరం కోవింద్‌ పేరును ఎంపికచేశామన్నారు. అయితే జాబితాలోని ఇతర సభ్యుల పేర్లను మాత్రం షా వెల్లడించలేదు. విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రధాని మోదీయే నేరుగా రంగంలోకి దిగారన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో మోదీ మాట్లాడినట్లు అమిత్‌ షా తెలిపారు. పలువురు బీజేపీ కీలక నేతలు కూడా ఎన్డీయే కూటమి పార్టీలతోపాటుగా ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఆయా పార్టీల అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. జూన్‌ 23న రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు.కోవింద్‌ సరైన వ్యక్తి!: మోదీ

రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థి అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘పేదలు, అణగారిన వర్గాల తరఫున బలమైన గొంతుకను వినిపిస్తున్న కోవింద్‌ అత్యున్నత రాజ్యాంగ పదవిలోనూ.. తన వాణిని కొనసాగిస్తారు. ఆయన రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థి’అని మోదీ ట్విటర్‌ ద్వారా ప్రశంసించారు. కోవింద్‌కు న్యాయరంగంలో అపారమైన అనుభవం, రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం దేశానికి చాలా ఉపయోగకరమన్నారు. ‘ప్రజాసేవ, పేదలు, బడుగు బలహీన వర్గాలకు తన జీవితాన్ని అకితం చేశారు’అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.ఏకగ్రీవం అవకాశం లేదు: కాంగ్రెస్‌

రాష్ట్రపతి ఎన్నిక ఈసారి ఏకగ్రీవమయ్యే అవకాశమే లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. తమతో సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించిందనందున ఏకగ్రీవానికి సహకరించాలన్న వారి వినతిని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. జూన్‌ 22న (గురువారం) జరిగే విపక్షాల సమావేశంలో ఎన్నికల బరిలో ఉండే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. ‘బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి స్పందించం. జూన్‌ 22 నాటి సమావేశంలో విపక్షాలన్నీ చర్చించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటాయి’అని ఆజాద్‌ తెలిపారు. వెంకయ్య, రాజ్‌నాథ్‌లు సోనియాను కలిసిన సమయంలోనూ ఎవరిపేరూ చర్చించలేదన్నారు. బీజేపీ నిర్ణయం ఏకపక్షమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు.కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫోన్లో కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని తెలిపారన్నారు. జూన్‌ 22న విపక్ష పార్టీల సమావేశంలో చర్చించాక నిర్ణయం చెబుతామన్నారు. రామ్‌నాథ్‌ను ఎంపిక చేయటం ద్వారా ప్రధాని మోదీ రాజకీయ మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారని.. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఎల్‌జేపీ చీఫ్‌ రాంవిలాస్‌ పాశ్వాన్‌ అన్నారు. దళితుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుని ఏమీ చేయని పార్టీలకు ఇదో చెంపపెట్టులాంటి చారిత్రక నిర్ణయమన్నారు. బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థికి తమ పూర్తి మద్దతుంటుందన్నారు. విపక్ష పార్టీలు కూడా కోవింద్‌కు మద్దతివ్వాలని.. లేదని బరిలో దిగాలని నిర్ణయిస్తే వారిని దళిత వ్యతిరేకులుగా చూడాల్సి ఉంటుందన్నారు.దళిత అభ్యర్థికే మా మద్దతు: బీఎస్పీ

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా యూపీకి చెందిన దళితనేత రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును తాము వ్యతిరేకించదలచుకోలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. రాజకీయేతర దళిత నాయకుడిని బరిలో దించుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. దళిత అభ్యర్థికే తమ మద్దతుంటుందంటూనే.. కోవింద్‌ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు. విపక్షాలు కూడా దళిత అభ్యర్థి పేరును ప్రకటించకపోతే కోవింద్‌కే తమ మద్దతుంటుందని సంకేతాలిచ్చారు. 2012 ఎన్నికల్లో మాయావతికి వ్యతిరేకంగా బీజేపీ తరపున రామ్‌నాథ్‌ ప్రచారం చేయటం గమనార్హం.ఇంకా చాలా మంది ఉన్నారుగా: మమత

గతంలో బీజేపీ దళితమోర్చా నాయకుడిగా పనిచేసినందుకే.. బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను బీజేపీ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిందని తృణమూల్‌ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెననర్జీ విమర్శించారు. ‘దేశంలో చాలా మంది దళితనేతలున్నారు. కానీ బీజేపీ దళిత మోర్చాకు నాయకుడిగా పనిచేసినందుకే కోవింద్‌ పేరును ప్రకటించారు. రాష్ట్రపతి పదవి అత్యున్నత రాజ్యాంగ స్థానం. ప్రణబ్‌ ముఖర్జీ వంటి స్థాయి వ్యక్తి ఆ స్థానంలో ఉండాలి. సుష్మా స్వరాజ్, ఎల్‌కే అడ్వాణీల్లో ఒకరిని ప్రకటించి ఉంటే బాగుండేది. ఓ వ్యక్తికి మద్దతివ్వాలంటే ఆయన గురించి మనకు తెలిసుండాలి. ఆ వ్యక్తి దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. 22నాటి విపక్ష సమావేశంలో మా నిర్ణయం ప్రకటిస్తాం’అని మమత బెనర్జీ వెల్లడించారు.పార్టీలకు అతీతంగా మద్దతివ్వండి: యోగి

విపక్ష పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా దళితనేత రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతివ్వాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కోరారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం దళిత సమాజానికి ఇచ్చిన అరుదైన గౌరవమన్నారు. ‘ఓ దళిత నాయకుడిని అత్యున్నత రాజ్యాంగ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించటం నయా సామాజిక జాగరూకతకు నిదర్శనం. ఇందుకోసం ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షాకు రాష్ట్రప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 22 కోట్లమంది రాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణం’అని యోగి పేర్కొన్నారు. యూపీ ముద్దుబిడ్డను రాష్ట్రపతిని చేయటంలో పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలు సహకరించాలని కోరారు.ఉత్సుకత.. ఆ వెంటనే ఆశ్చర్యం!

సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అప్పటికే పలువురి పేర్లతో భారీ ప్రచారం జరగటంతో ఈ జాబితాలోని వారిలో ఒకరుండొచ్చని అందరూ భావించారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచీ ఉత్కంఠ అంతకంతకూ పెరిగింది. అయితే.. అమిత్‌షా దీన్ని మరింతగా పెంచారు. అభ్యర్థి పేరును ప్రకటించే ముందు కొన్ని క్షణాలు ఆగారు. లైవ్‌లో చానెళ్లు, వీటిని చూస్తూ దేశవ్యాప్తంగా కోట్ల మందిలో మరింత ఉత్సుకత పెరిగింది. ఈ సమయంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించటంతో ఉత్సుకత పోయి అయోమయం నెలకొంది. ఊహించని పేర్లేమీ లేకపోవటమే కాదు.. పెద్దగా సుపరిచితుడేమీ కాని రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరు ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కోవింద్‌ వివరాలు తెలుసుకునేందుకు మీడియా సంస్థలతో సహా అందరూ గూగుల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.


అన్ని పార్టీల మద్దతు కోరతా: కోవింద్‌

రాష్ట్రపతి పదవి కోసం అందరికీ సమ్మతమైన అభ్యర్థిగా ముందుకొచ్చేందుకు అన్ని ప్రధాన పార్టీల నేతలను కలసి మద్దతు కోరతానని రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థిగా తన పేరును ప్రకటించాక సాయంత్రం ఆయన పట్నా నుంచి ఢిల్లీ చేరుకుని మొదట బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో, తర్వాత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమిత్‌ షా నివాసంలో గంటసేపు ఉన్న కోవింద్‌ను పార్టీ నేతలు అభినందించారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి షా, కోవింద్‌ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద బాధ్యత అందుకున్న చిన్న పౌరుడినని కోవింద్‌ అన్నారు. ‘ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులందర్నీ.. ప్రధాన పార్టీల నేతలందర్నీ కలుసుకుని మద్దతు కోరతాను.. ప్రతి పౌరుడు నాకు మద్దతిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. తర్వాత ఆయన బిహార్‌ నివాస్‌కు వెళ్లారు. కోవింద్‌ ఈ నెల 23న నామినేషన్‌ వేసే అవకాశముంది. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవిని అధిష్టించిన రెండో దళితుడు అవుతారు. కాంగ్రెస్‌

రాష్ట్రపతి ఎన్నిక ఈసారి ఏకగ్రీవమయ్యే అవకాశమే లేదని, అభ్యర్థి ఎంపికపై బీజేపీ తమను సంప్రదించలేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.తృణమూల్‌

గతంలో బీజేపీ దళిత మోర్చా నాయకుడిగా పని చేసినందుకే.. రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.బీఎస్పీ

దళితుడైన రామ్‌నాథ్‌ పేరును తాము వ్యతిరేకించదలచుకోలేదని బీఎస్పీ పేర్కొంది.వైఎస్సార్‌సీపీ

దళిత సామాజిక వర్గానికి చెందిన కోవింద్‌ అభ్యర్థిత్వానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది.టీడీపీ..

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌కు టీడీపీ మద్దతు ఇచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.టీఆర్‌ఎస్‌..

ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు టీఆర్‌ఎస్‌ హర్షం వ్యక్తం చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటించింది.

Back to Top