కశ్మీర్‌పై అత్యవసర సమావేశానికి షా పిలుపు

కశ్మీర్ నేతలతో బీజేపీ కోర్ కమిటీ సమావేశం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తోన్న ఆర్టికల్ 35ఏపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కోర్ కమిటీ అత్యవసర సమవేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొనవల్సిందిగా బీజేపీ కశ్మీర్ నాయకులకు ప్రత్యేక ఆహ్వానం పంపడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో లోయలో ప్రస్తుత పరిస్థితిపై పార్టీ నేతలు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా గడిచిన వారం రోజుల నుంచి ఆర్టికల్ 35ఏను రద్దు చేస్తారని లోయలో విస్రృతంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో వదంతులు మరింత పెరిగాయి. ఆర్టికల్ 35ఏ రద్దుకు కేంద్రం సిద్ధమయిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసింది. కేవలం ఉగ్రవాద ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ప్రత్యేక అదనపు బలగాలను కశ్మీర్‌కు తరలించామని వివరించింది. అయితే నేటి భేటీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి