వాళ్ల పిల్లలు విదేశాల్లో.. వీళ్ల చేతికేమో..

Amit Shah Says Separatists Send Their Children Abroad - Sakshi

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో నివిసించే దాదాపు 130 మంది వేర్పాటు వాదుల కుటుంబాలు తమ పిల్లలను విదేశాల్లోనే చదివిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. వేర్పాటువాదులు మాత్రం స్థానికంగా ఉండే విద్యార్థుల చేతికి రాళ్లు ఇచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన పొడగింపు అంశంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు అమిత్‌ షా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ ప్రముఖ కశ్మీర్‌ వేర్పాటువాది కొడుకు ఒకరు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నారు. కేవలం ఆయన ఒక్కరే కాకుండా ఇలాంటి ఎంతోమంది వేర్పాటువాదుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.  అలాంటి ఎంతోమంది లిస్టు నా దగ్గర ఉంది. కానీ వారి పేర్లు ప్రస్తావించను. తమ పిల్లలకు మంచి చేసే వేర్పాటువాదులు.. లోయలో బడులు మూసివేస్తున్నారు.ఇక్కడ ఉండే పిల్లల చేతికి రాళ్లు ఇస్తున్నారు’ అని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ వేర్పాటువాద నేత ఆసియా ఆండ్రాబీ పేరును ప్రస్తావించిన అమిత్‌ షా.. ఆమె తన కొడుకును మలేషియాలో ఉంచారు.. తాను మాత్రం లోయలో అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ విషయం గురించి హోం శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..‘ వేర్పాటువాద కుటుంబాలకు చెందిన 90 శాతం మంది పిల్లలు పాకిస్తాన్‌, గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారు. వేర్పాటువాదుల పిల్లలు, బంధుగణానికి అక్కడ అడ్మిషన్లు సంపాదించడంలో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.

కాగా కశ్మీర్‌లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్‌ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్‌ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్‌తరన్‌-ఈ-మిలాత్‌ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే విద్యార్థినులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్‌ జెండాలు ఎగరవేసినందుకు ఆసియా పలుమార్లు అరెస్టయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్‌బోర్న్‌లో ఎంటెక్‌ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఆసియా ప్రస్తుతం తీహార్‌ జైళ్లో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top