‘పౌర చట్టంపై వెనక్కితగ్గం’

Amit Shah Refuses To Back Down On Citizenship Act - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో ఈ చట్టంపై వెనక్కితగ్గే ప్రసక్తి లేదని హోంమంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు. పొరుగు దేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటూ దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతుందని స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించి భారతీయులుగా గౌరవంగా జీవించేందుకు మోదీ ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు మిన్నంటిన క్రమంలో ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో ఏ ఒక్కరి జాతీయతా కోల్పోవడం జరగదని ఆందోళనకారుల అభ్యంతరాలను పోగొట్టే ప్రయత్నం చేశారు.

ఈ చట్టంపై ఎలాంటి భయం అవసరం లేదని మన విద్యార్ధులు, ముస్లిం సోదరులకు తాను విన్నవిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరూ భారత పౌరసత్వం కోల్పోరని భరోసా ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉందని ప్రతి ఒక్కరూ దాన్ని నిశితంగా పరిశీలించవచ్చని సూచించారు. తాము అందరికీ అభివృద్ధి నినాదంతో ముందుకెళతామని ఏ ఒక్కరికీ అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. విపక్ష కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top