అమిత్‌ షా చేతిలో ఉన్న ఆ పత్రాల్లో ఏం ఉందో!?

The Amit Shah Photo That Grabbed Attention After Article 370 Announcement - Sakshi

న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి ఎంత చర్చ జరిగిందో.. అదే స్థాయిలో ఓ ఫోటో గురించి కూడా చర్చ జరిగింది. ఇంతకూ ఆ ఫోటో ఎవరిదంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాది. సాధరణంగా సెలబ్రిటీల ఫోటోలు, వెరైటీగా ఉన్న ఫోటోలు వైరల్‌ కావడం చూస్తుంటాం. కానీ ఈ రోజు అందుకు భిన్నంగా అమిత్‌ షా ఫోటో తెగ వైరలయ్యింది. నెట్టింట్లో ఈ ఫోటో గురించి ఒకటే చర్చ. ఆర్టికల్ 370 రద్దు గురించి సభలో ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు అమిత్ షా చేతిలో కొన్ని పత్రాలు పట్టుకుని ఉన్న ఫోటో ఇది.

అయితే ఆ ఫోటోలో ఏముంది అన్న విషయం అందరిని ఆకర్షించింది.  ఇంతకూ ఆ ఫోటోలో ఏం ఉందంటే.. ఆర్టికల్‌ 370 రద్దుకు సబంధించి రాజ్యాంగ పరంగా, రాజకీయంగా, న్యాయపరంగా ఏఏ సెక్షన్లను చేర్చాలి, వాటి వల్ల వచ్చే చిక్కులు.. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇలా పూర్తి సమాచారాన్ని ఈ పత్రాల్లో పొందుపరిచారు. అంతేకాకుండా రాష్ట్రపతికి ఈ సమాచారాన్ని చేరవేయడం, రాజ్యసభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జమ్మూకశ్మీర్‌కి హోం శాఖ కార్యదర్శిని పంపించడం లాంటి అంశాలు ‘మార్కర్’ తో గీసి మరీ ఉండటాన్ని మనం ఇందులో గమనించవచ్చు.

ఈ పత్రాలను సభలోకి తీసుకెళ్లిన తర్వాత వీటి ఆధారంగానే ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం లాంటి సంచలనాత్మక నిర్ణయాలను అమిత్‌షా ప్రకటించారు. అంటే ముందే ఓ పద్ధతి ప్రకారం చక్కగా రాసుకొని, ఎలాంటి చిన్న తప్పు దొర్లకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుందని ఈ ఫోటో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top