77 ఏళ్ల వయస్సులో 47వ సారి...


జైపూర్ :  ఈ ఏడాది ఎలాగైనా పదో తరగతి పరీక్షలు పాస్ అయిపోతా...  ఆ వెంటనే ఉద్యోగం కోట్టేస్తా... ఆ మరుక్షణమే ఓ యువతి మెడలో తాళి కట్టేస్తానంటూ ఊవ్విళ్లూరిపోతున్నాడు... ఇదేదో టీనేజీ కుర్రోడి కలలు కంటున్నాడు అనుకుంటే... మీరు ఖచ్చితంగా ముద్దపప్పులో కాలేసినట్టే. ఆయన గారి పేరు శివ చరణ్ యాదవ్. వయస్సు 77 ఏళ్లు. రాజస్థాన్లోని క్హొహరి గ్రామ నివాసి. శివ చరణ్ ఈ ఏడాది జరగనున్న 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నాడు. 


ఆయనగారు ఇప్పటి వరకు 46 సార్లు ఈ పరీక్ష రాశాడు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ పరీక్షల్లో శివ చరణ్ పాస్ కాలేదు. కొన్ని సబ్జెక్టుల్లో పాస్ అయితే... మరికొన్ని సబ్జెక్టుల్లో తప్పేవాడు. ఈ ఏడాది జరిగే పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అవుతానని ప్రతిసారి అనుకునేవాడు... కానీ లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లో పాస్ అయితే .. హిందీ, ఇంగ్లీషు పేపర్లలో తప్పేవాడు. 


ఇవి పాస్ అయితే మరికొన్ని పేపర్లలో తప్పేవాడు. అయితే 1995లో 10వ తరగతి పరీక్షల్లో అన్ని పరీక్షల్లో పాస్ అయినాడు... కానీ ఒక్క లెక్కల్లో తప్పా. అలాగే గతేడాది సోషల్ సైన్సెస్లో మాత్రమే పాస్ అయ్యాడు. మీగతా సబ్జెక్టులు అన్నీ తప్పాడు. అంతకుముందు ఏడాది జరిగిన పరీక్షల్లో అయితే అన్నీ పరీక్షలు తప్పాడు.  ఆ ఏడాది గ్రామంలోని స్కూల్ టీచర్లతో ప్రత్యేకంగా క్లాసులు చెప్పించుకోవడం వల్లే ఇలా జరిగిందని పైగా శివ చరణ్ సెటైర్లు వేస్తున్నాడు.



 శివచరణ్ రెండు నెలల వయస్సు ఉన్నప్పుడే కన్న తల్లి చనిపోయింది. పదేళ్ల వయస్సులోతండ్రి కూడా కాలం చేశాడు. ఒంటరిగా మిగలడంతో మామయ్య తన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే పెరిగాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు.  ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తోపాటు ఇంటికి సమీపంలోని దేవాలయంలో పెట్టే ప్రసాదామే తనకు జీవితానికి ఆధారమని శివ చరణ్ చెబుతున్నాడు.


శివ చరణ్ 10వ తరగతి పరీక్షలు రాయడానికి స్కూలుకి వెళ్లితే... అక్కడి సిబ్బంది ప్రత్యేకంగా చూస్తారని ఆ గ్రామ నివాసి... రామ్కేష్ మీనా చెప్పారు. ఇంతకీ శివ చరణ్ ఎప్పటి నుంచి పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడో తెలుసా... 1968 నుంచి క్రమం తప్పకుండా 10 తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ ఏడాదన్న రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో శివచరణ్ గట్టెక్కి... పెళ్లి కూతురుతో పాటు పెళ్లి పీటలు ఎక్కుతాడేమో చూద్దాం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top